Telangana: విద్యార్థులను వేధించే కాలేజీలకు ఇకపై చెక్

విద్యార్థులను వేధించే ఇంటర్మీడియట్ కాలేజీలకు ఇకపై చెక్ పడనుంది. విద్యార్థుల ఇబ్బందులకు గురిచేసే కాలేజీ సిబ్బంది, యాజమాన్యాలపై కఠిన చర్యలకు తెలంగాణ ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. విద్యార్థులను వేధించినా, అవమానించినా సిబ్బందితో పాటు కాలేజీ మేనేజ్‌మెంట్‌పై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు.. విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆ కాలేజీ గుర్తింపును కూడా రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వారం రోజుల్లో విడుదల చేయనున్నారు.
ఇక ఇటీవల ఓ కార్పొరేట్ కాలేజ్ లో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యల్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 14 విద్యా సంస్థల ప్రతినిధులతో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించారు. అలాగే పలు నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నార్సింగ్‌లోని ప్రైవేట్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ కాలేజీలో ఇప్పటికే విద్యార్థులు చదువుతున్నందున, వచ్చే సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇక విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి వీలుగా పలు చర్యల్ని తీసుకోవాలని అధికారులు కాలేజీల ప్రతినిధులకు సూచించారు. ముఖ్యంగా విద్యార్థులకు కనీసం 8 గంటల నిద్ర ఉండేలా ఆయా కాలేజీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరోవైపు ప్రతి కాలేజీలో ఒక మానసిక నిపుణుడిని అందుబాటులో ఉంచాలని, విద్యార్థుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఒకవేళ విద్యార్థి ప్రవర్తనలో ఏమైనా భిన్నమైన లక్షణాలను కనిపిస్తే.. వెంటనే తగిన చర్యల్ని తీసుకోవాలన్నారు. మార్కుల కోసం విద్యార్థులను ఒత్తిడి చేయొద్దని సూచించారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి, ఆయా కాలేజీల్లో తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయి మార్గదర్శకాలను వారంలో విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే.. ఈ అంశంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి మూడు రోజుల గడువు ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

