Telangana: నేడు కేబినెట్ సమావేశం

Telangana: నేడు కేబినెట్ సమావేశం
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఒక్కసారిగా హీటెక్కిన రాష్ట్ర రాజకీయాలు

ఇవాళ(గురువారం) తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం మంత్రిమండలి భేటీ అవుతుంది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక కవితకు నోటీసులు అందిన నేపథ్యంలో కేబినెట్‌ మీటింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. కవితకు ఈడీ నోటీసుల అంశంపై మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది. కవితకు ఈడీ నోటీసుల్ని కేసీఆర్‌ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈడీ విచారణలో ఊహించని పరిణామాలు ఎదురైతే.. వాటిని ఎదుర్కొనేలా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. కవితను ఈడీ అరెస్ట్‌ చేస్తే ఎలా వ్యవహరించాలన్న విషయంపై చర్చించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది.

మరోవైపు ఇండ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు, అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చే పథకంపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం… ఇళ్ల స్థలాలు, క్రమబద్దీకరణ, పట్టాల పంపిణీ దిశగా ప్లాన్ చేస్తోంది. ఇక దళితబంధు పథకం అమలుపైనా మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. భూముల అమ్మకం, ఇతరత్రా మార్గాల ద్వారా ఖజానాకు ఆదాయాన్ని పెంచుకోవడం, నిధుల సమీకరణపై చర్చించే ఛాన్స్ ఉంది.

రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ సమావేశం జరగనుంది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు , జిల్లా పరిషత్ చైర్మన్‌లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్‌లు, డిసిఎమ్ఎస్, డిసిసిబి చైర్మన్‌లు పాల్గొంటారు. ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో.. ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలతో పాటు పలు అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story