Telangana: సీఎం కేసీఆర్‌కు భట్టి లేఖ

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 19వ రోజు కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న భట్టికి.. ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. తమ సమస్యలు చెప్పుకుని పరిష్కరించాలని వేడుకుంటున్నారు జనం. ఈ సందర్భంగా పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు భట్టి విక్రమార్క. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మార్చి 16 నుంచి ఆదిలాబాద్ జిల్లా, బోథ్ నియోజకవర్గం, పిప్పిరి గ్రామం నుంచి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టానని.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తన దగ్గరకి ఆదివాసీలు, గిరిజనులు వేలాదిమంది వచ్చి పోడు భూముల సమస్యలను చెప్పుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర అటవీ హక్కుల చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు భూములు... బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి ద్వారా భూమిపై రైతులకు హక్కు లేకుండా పోయిందన్నారు. లక్షల మంది ఆదివాసీల, గిరిజనుల పోడు భూముల సమస్యను పరిష్కరించాలని లేఖలో కోరారు.
ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండతో పాటు పలు జిల్లాల్లో పోడు చేసుకుంటున్న రైతులకు తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలన్నారు. పోడు పట్టాలపై 2014 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ నీటి మీద రాతలుగా మారాయని విమర్శించారు. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి 2014, 2018 ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచారని గుర్తు చేశారు. నాటి ఎన్నికల బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రస్తావించిన భట్టి.. వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com