Telangana: కొత్త సచివాలయంలో తొలి మంత్రివర్గ సమావేశం

తెలంగాణ కొత్త సచివాలయంలో తొలి మంత్రివర్గం సమావేశం ప్రారంభమైంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.. మరికొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు, నిధుల విడుదలపై చర్చించనున్నారు.. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున.. పోడు పట్టాల పంపిణీ తేదీలు, గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రకటించి అమలు కార్యచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక రిజల్ట్, ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు, పూర్తయిన ప్రారంభోత్సవాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహ రచన చేస్తారని తెలుస్తుంది. ఈ అంశాలపై సీఎం కేసీఆర్ మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తారని తెలుస్తుంది. అంతేకాకుండా అమరవీరుల స్మృతి వనం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఏదో ఒక రోజు ప్రారంభించే అంశంపై తేదీ ఖరారుపై చర్చకు వచ్చే వీలుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే పలువురు పేర్లను ఫైనలైజ్ చేసిన సీఎం కేసీఆర్.. కేబినెట్ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com