Telangana: గురుకులాల్లో 13వేల ఖాళీలు

తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య భారీగా పెరగనుంది. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో మరో 2వేలకు పైగా పోస్టుల్ని ఆయా సొసైటీలు గుర్తించాయి. వాటిని త్వరలోనే జారీ చేయనున్న గురుకుల నియామక ప్రకటనల్లో భాగంగా నింపేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాయి. ఇక ఈ పోస్టులకు అనుమతులు లభిస్తాయని సొసైటీలు భావిస్తున్నాయి. వీటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇస్తే గురుకులాల్లో భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య 13వేలకు పైగా చేరుకోనున్నాయి. ప్రస్తుతం గురుకులాల్లో 11వేల 12 పోస్టులకు అనుమతులు లభించాయి. సంబంధిత నియామక ప్రకటనలు సిద్ధమయ్యాయి. కొత్తగా మంజూరయ్యే ఎస్సీ, ఎస్టీ గురుకులాల పోస్టులు వీటికి కలుపుతారు. ఇక అన్నింటికీ కలిపి ఒకేసారి ప్రకటనలు ఇవ్వాలని గురుకుల నియామకబోర్డు భావిస్తోంది.
సంక్షేమ గురుకులాల్లో తొలుత ప్రభుత్వం 9వేల 96 పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి బీసీ సొసైటీ పరిధిలో కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ కళాశాలలు ప్రారంభమయ్యాయి. ఈ పోస్టులకు సంబంధించి బీసీ సంక్షేమశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా, ఈ జనవరిలో బీసీ గురుకుల సొసైటీలో 2వేల 591 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. బీసీ పోస్టులు తేలాక గురుకుల నియామక ప్రకటనలు ఇవ్వాలని బోర్డు భావించింది. అయితే అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో దాదాపు 2వేలకు పైగా ఖాళీ పోస్టులున్నట్లు సొసైటీలు గుర్తించాయి. ఈ పోస్టుల భర్తీకి సకాలంలో ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. బీసీ గురుకులాల్లో అదనపు పోస్టులకు అనుమతులు వచ్చాక ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోనూ అదనపు పోస్టులకు అనుమతులు ఇవ్వాలని సొసైటీలు ప్రభుత్వానికి నివేదికలు పంపాయి. ఇక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే అన్ని పోస్టులు ఓకేసారి భర్తీ కానున్నాయి
============
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com