Telangana: కొండగట్టులో సీఎం కేసీఆర్

Telangana: కొండగట్టులో సీఎం కేసీఆర్
యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్ధికి చర్యలు, బడ్జెట్‌లో 100కోట్ల రూపాయలు కేటాయింపు

కొండగట్టు అంజన్నకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధిపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే బడ్జెట్‌లో 100కోట్ల రూపాయలు కేటాయించిన కేసీఆర్ కొండగట్టుకు వెళ్లారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో కొండగట్టు చేరుకున్న కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసరాలను పరిశీలించారు.

ఏరియల్ సర్వే తర్వాత కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌ స్వాగతం పలికారు. బస్సులో కొండగట్టు గుట్టపైకి వెళ్లారు. అనంతరం అర్చకులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రాంగణాన్ని మంత్రులు, అధికారులతో కలిసి పరిశీలించారు. తర్వాత ఆర్కిటెక్ట్ ఆనంద్‌ సాయితో కలిసి ఆలయాభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తారు. ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సమాలోచనలు జరుపుతారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి రానున్నారు.

దాదాపు 25 ఏళ్ల తర్వాత జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రానికి వచ్చారు సీఎం కేసీఆర్. చివరగా టీఆర్ఎస్ పార్టీ స్థాపించకముందు 1998లో అంజన్నను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండగట్టుకువచ్చారు కేసీఆర్. ఆలయాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా వంద కోట్ల నిధులు ప్రకటించారు. ఆలయంలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story