Telangana: నత్త నడకన బీబీనగర్‌ ఎయిమ్స్‌ పనులు

Telangana: నత్త నడకన బీబీనగర్‌ ఎయిమ్స్‌ పనులు
ఎయిమ్స్‌ను మంజూరు చేశారు తప్ప.. దాని నిర్మాణాన్ని పట్టించుకోని కేంద్రం

తెలంగాణలోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ పనులు నత్త నడకన సాగుతున్నాయి. ఎయిమ్స్‌ను మంజూరు చేశారు తప్ప.. దాని నిర్మాణాన్ని పట్టించుకోవట్లేదని కేంద్ర ప్రభుత్వమే తెలిపింది. బీబీనగర్‌ ఎయిమ్స్‌కు విడుదల చేసిన నిధులపై ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సమాచారం ఇచ్చింది.

బీబీనగర్‌లో ఎయిమ్స్‌ నిర్మాణానికి 2018 డిసెంబర్‌ 17న కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. వేయి కోట్లతో అత్యాధునిక వసతులతో ఆసుపత్రిని 2022 నాటికి నిర్మిస్తామని తెలిపింది. అయితే 2022 జూలై వరకు కనీసం పనులు మొదలుపెట్టలేదు. దీంతో కేంద్రం గడువును 2024 అక్టోబర్‌కు పొడిగించింది. అంచనాలను 1365 కోట్లకు పెంచింది. అయితే ఇప్పటివరకూ కేంద్రం విడుదల చేసిన నిధులు కేవలం 156 కోట్లు. అంటే మొత్తం అంచనాల్లో 11.4 శాతం అన్నమాట.

మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంజూరైన ఎయిమ్స్‌లకు మాత్రం భారీగా నిధులు విడుదల చేశారన్న విమర్శలున్నాయి. ఇక తెలంగాణ ఎయిమ్స్‌ మంజూరై ఐదేళ్లు గడుస్తున్నా కనీసం ఒక్క భవన నిర్మాణం పూర్తి కాలేదు. మొత్తం పనుల్లో 5శాతం మాత్రమే జరిగాయి. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భవనాల్లోనే తాత్కాలికంగా కళాశాల, వైద్యశాల నడుస్తున్నాయి. వచ్చే ఏడాది అక్టోబర్‌ నాటికి పూర్తి చేస్తామని కేంద్రం చెప్తోంది. ఇంకా 20 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. 20 నెలల్లో 88శాతం నిధులు విడుదల చేసి.. 95 శాతం పనులు పూర్తి చేయడం అసాధ్యమంటున్నారు వైద్య నిపుణులు.

Tags

Read MoreRead Less
Next Story