TG: తెలంగాణ ఆరోగ్య రంగంలో విప్లవం

తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత ఆధునికంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. డిజిటల్ సాంకేతికతను వినియోగించి ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలను ఒకే చోట భద్రపరచే విధంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లినప్పుడు పాత రికార్డులు, పరీక్షల వివరాలు లేదా చీటీలు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, ఒకే హెల్త్ కార్డు ద్వారా వైద్య సేవలు పొందేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి సంగారెడ్డి జిల్లాను ఎంపిక చేశారు. దాదాపు రూ.94 కోట్ల వ్యయంతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి పూర్తి ఆరోగ్య వివరాలతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా, గురువారం సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా దీనికి శ్రీకారం చుట్టనున్నారు.
ఆరోగ్య సమాచారమంతా..
ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలులోకి వస్తే, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో నమోదు అవుతుంది. రోగి గతంలో ఏ వ్యాధితో చికిత్స తీసుకున్నాడు, ఏ పరీక్షలు చేయించుకున్నాడు, ఏ మందులు వాడుతున్నాడు వంటి వివరాలు అన్నీ ఒకే ప్రొఫైల్‌లో నిల్వ చేయబడతాయి. తద్వారా రోగి ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా అక్కడి వైద్యులు వెంటనే ఆ వివరాలను పరిశీలించి సరైన చికిత్స అందించగలుగుతారు. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు నుంచి బోధనాసుపత్రుల వరకు ఎక్కడైనా ఈ హెల్త్ కార్డు ద్వారా రోగి వివరాలు అందుబాటులో ఉండేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా కాగితరహిత విధానంలో అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు ఇకపై చీటీలు లేదా పాత పరీక్షల పత్రాలు వెంట తీసుకురావాల్సిన అవసరం లేకుండా హెల్త్ కార్డు చూపిస్తే సరిపోతుంది. వైద్యులు ఆ కార్డు ద్వారా రోగి ఆరోగ్య చరిత్రను పరిశీలించి చికిత్స అందిస్తారు. అవసరమైన మందులను కూడా అదే కార్డు ఆధారంగా అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ఆసుపత్రుల్లో రికార్డుల నిర్వహణ సులభం అవ్వడంతో పాటు రోగులకు కూడా సమయం ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఆభా) వ్యవస్థతో కూడా ఈ ప్రణాళికను అనుసంధానిస్తున్నారు. ఆధార్ సంఖ్య ఆధారంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఆభా నంబర్లు కేటాయిస్తున్నారు. ఈ నంబర్ల ఆధారంగా ఓపీ విభాగాల్లో స్లిప్‌లు సులభంగా పొందే విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. అదే వ్యవస్థను మరింత విస్తరించి రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపంలో సమగ్ర ఆరోగ్య రికార్డు వ్యవస్థను రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పనలో ఆరోగ్యశ్రీ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. టీజీ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసి, ఆసుపత్రుల మధ్య డేటా మార్పిడిని సులభతరం చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.
ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం
ఈ వ్యవస్థ అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ప్రభుత్వానికి సమగ్ర సమాచారం లభిస్తుంది. ఏ ప్రాంతంలో ఏ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి, ఏ వైద్య సేవలు అవసరం అవుతున్నాయి, ఎక్కడ వైద్య వసతులు పెంచాల్సిన అవసరం ఉంది వంటి విషయాలను విశ్లేషించడానికి ఇది సహాయపడుతుంది. ఆరోగ్య సమస్యలపై స్పష్టమైన డేటా లభించడం వల్ల ప్రభుత్వానికి సరైన విధాన నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. నిధుల కేటాయింపు, వైద్య సదుపాయాల విస్తరణ, అత్యవసర సేవల మెరుగుదల వంటి అంశాల్లో కూడా ఇది కీలకంగా ఉపయోగపడుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితులపై సమగ్ర డిజిటల్ రికార్డు రూపొందించాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. సుమారు 42 లక్షల మంది డ్వాక్రా మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య వివరాలను డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌లో నమోదు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు. సెక్రటేరియట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రజాపాలన–ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు అమలు చేయాల్సిన కార్యక్రమాలను 99 రోజుల యాక్షన్ ప్లాన్ రూపంలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులకు సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
