THUMMALA: రైతుల ప్రయోజనాలకు భంగం కలిగితే సహించబోం
తెలంగాణలో విత్తన సరఫరాలో ఇబ్బంది సృష్టిస్తే ఏకంపెనీని ఉపేక్షించబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలకు భంగం కల్గించే ఏ చర్యని ప్రభుత్వం సహించబోదని తేల్చిచెప్పారు. విధుల్లో అలసత్వం వహించిన అధికారులపైనా చర్యలు తప్పవని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా తనిఖీ బృందాలు ఏర్పాటుచేసుకొని విత్తనఅమ్మకాలు పర్యవేక్షిస్తూ నకిలీ విత్తనాలకి అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు.2024 ఖరీఫ్‌లోదాదాపు 60.53 లక్షల ఎకరాల్లో పత్తిసాగు అంచనావేసినట్లు చెప్పిన తుమ్మల అందుకు సరిపడా బోల్‌గార్డ్ - బీజీ-2 పత్తి విత్తనాలు మే చివరి నాటికిరైతులకి అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. BG-2 విత్తన ప్యాకెట్ గరిష్ట ధర 864 రూపాయలుగా కేంద్రం నిర్ణయించిన రాష్ట్రంలో ఎవరైనా అంతకంటే ఎక్కువకి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల స్పష్టంచేశారు.
కేసీఆర్ ఆగ్రహం
తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచించిందని..బీఆర్‌ఎస్ అధినేత KCR ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాలు వరికి 500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం..... ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 90శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారన్న KCR.... ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం బోనస్ ఇవ్వబోమని ఎలా చెబుతుందని ప్రశ్నించారు. డబ్బాలో ఓట్లు పడగానే..కాంగ్రెస్‌కు రైతుల అవసరం తీరిందని మండిపడ్డారు. రైతుల హక్కులు, హామీల సాధన కోసం రాష్ట్రవ్యాప్త నిరసన చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలన్న గులాబీ దళపతి... రైతులకు భరోసా కల్పించేలా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రతిరోజూ వడ్ల కళ్లాల వద్దకు వెళ్లాలని... రైతుల హక్కులు కాపాడేందుకు బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. రేపు రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ శ్రేణులు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com