Dalitha Bandhu: దళితబంధుపై సీఎం స్పష్టత.. అన్ని వేల కోట్లతో..

Dalitha Bandhu: దళితబంధుపై సీఎం స్పష్టత.. అన్ని వేల కోట్లతో..
Dalitha Bandhu: దళితబంధు పథకంపై ప్రతిపక్షాలు రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు.

Dalitha Bandhu: దళితబంధు పథకంపై ప్రతిపక్షాలు రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. దళితులు దయనీయ స్థితిలో ఉన్నారని, దేశమంతా ఇదే పరిస్థితి ఉందని గుర్తు చేశారు. అసెంబ్లీలో దళిత బంధు పథకంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

తెలంగాణ అసెంబ్లీలో దళితబంధు పథకంపై సుదీర్ఘ చర్చ జరిగింది.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకం గురించి చాలాసేపు మాట్లాడారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రతి ప్రశ్నకూ వివరంగా సమాధానం ఇచ్చారు.. హుజురాబాద్‌ నియోజకవర్గంలోనే కాకుండా, రాష్ట్రమంతా అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. అయితే, పథకానికి నిధులు ఎలా కేటాయిస్తారనే దానిపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలన్నారు.

దళితబంధుపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. అఖిలపక్షంతో కలిసి ఢిల్లీ వెళ్లి దళితబంధు కోసం నిధులు ప్రధానిని అడుగుదామన్నారు. దళితబంధు నిధుల సమీకరణకు అఖిలపక్షాన్ని సీఎం ఢిల్లీకి తీసుకెళ్తే తామూ వస్తామన్నారు. హుజురాబాద్‌కు 2వేల కోట్లు కలెక్టర్‌ ఆఫీస్‌కు పంపారని.. మిగతా నాలుగు మండలాలకూ నిధులు పంపారా లేదా అని అసెంబ్లీలో ప్రశ్నించారు.

హుజురాబాద్‌ నియోజకవర్గంలోనే దళితబంధు అమలు చేస్తున్నారన్న విపక్షాల వాదనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోసిపుచ్చారు. హుజూరాబాద్‌ ఎన్నిక కోసం అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదని చెప్పారు. వచ్చే ఏడాది మార్చిలోపు 100 నియోజకవర్గాల్లో పథకాన్ని అమలు చేస్తామన్నారు. వచ్చే బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. దళితుల కోసం ఒక్కో నియోజకవర్గంలో 4 వేల కోట్లతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా డిమాండ్‌ చేశారు. కుల గణన జనాభా లెక్కలు జరగాల్సిందేనన్నారు. ఇందుకోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని చెప్పారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్రం నుంచి రిజర్వేషన్లు అమలు చేసుకోని తెస్తే ఘనంగా సన్మానం చేస్తామన్నారు కేసీఆర్‌.

మరోవైపు ఇదే చర్చ ముగింపు సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌పై కూడా సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. రెండు, మూడు నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. దళితబంధుపై చర్చ అనంతరం అసెంబ్లీని స్పీకర్‌ గురువారానికి వాయిదా వేశారు.

Tags

Read MoreRead Less
Next Story