ASSEMBLY: ఈనెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ASSEMBLY: ఈనెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
X
కులగణన నివేదికను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. నేడు మంత్రివర్గ ఉప సంఘానికి కుల గణన నివేదిక

తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 5న ప్రత్యేకంగా సమావేశం కానుంది. కుల గణన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెడతామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వెల్లడించారు. కుల గణనపై కేబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. భేటీలో ఉత్తమ్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. నేడు మంత్రివర్గ ఉప సంఘానికి కుల గణన నివేదిక అందుతుందని తెలిపారు. ఈ నెల 5న మంత్రివర్గం ముందుకు కుల గణన నివేదిక వస్తుందని చెప్పారు. నేటి నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించి వాటిని ఆమోదించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నివేదికలు ప్రభుత్వానికి అందడం, అనంతరం కేబినెట్ సబ్‌ కమిటీ అధ్యయనం చేసి కేబినెట్‌కు అందించడం, ఆ తరువాత మంత్రివర్గంలో వాటికి ఆమోదం తెలిపి అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రాష్ట్ర మంత్రివర్గం, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

కీలక చర్చలు జరిపిన సీఎం

తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, వాటికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యల ముఖ్యమంత్రి , మంత్రులు విషయాలను చర్చించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస​రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వర్​రావు, దామోదర్​ రాజనర్సింహ, శ్రీధర్​బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కొమటిరెడ్డి వెంకట్​రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకు అవసరమైన ప్రక్రియను సైతం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం బీసీ డెడికేటెడ్ కమిషన్​ నివేదిక, ఎస్సీ వర్గీకరణ నివేదికలను తెప్పించుకొని వాటిని ఆమోదించాలని సమావేశంలో నిర్ణయించారు.

నేడు సబ్ కమిటీకి కులగణన రిపోర్డు

నేడు మధ్యాహ్నం 2 గంటలకు కులగణన నివేదికను రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తారు. అనంతరం దీనిపై చర్చించేందుకు సెక్రెటేరియట్‌లోని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినేట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. చర్చ అనంతరం ఆమోదం తెలుపనుంది. . అనంతరం నివేదికను రెడీ చేసి ఈ నెల 5న ఉదయం జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నది. అక్కడ ఆమోదం లభించిన అనంతరం అదేరోజు మధ్యాహ్నం నిర్వహించనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కులగణన నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Tags

Next Story