TS POLLS: నేటి నుంచే నామినేషన్ల పర్వం

TS POLLS: నేటి నుంచే నామినేషన్ల పర్వం
మరింత వేడెక్కనున్న ప్రచారం... నేడు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రారంభ ఘట్టానికి రంగం సిద్ధమైంది. జారీతో నేటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్‌కు ఇప్పటికే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తీసుకున్నారు. నేడు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీంతో కొత్త శాసనసభ ఏర్పాటుకు వీలుగా సభ్యులను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఆ వెంటనే నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్లను ఈ నెల పదో తేదీ వరకు స్వీకరిస్తారు. నామపత్రాల పరిశీలన 13వ తేదీన చేపడతారు. ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 15. పోలింగ్ ఈ నెల 30 తేదీన నిర్వహించి వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. డిసెంబర్ ఐదో తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. సెలవు రోజుల్లో నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండదు.


ఆర్వో, ఏఆర్వో కార్యాలయం సమీపంలోని వంద మీటర్ల పరిధిలోకి గరిష్టంగా మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థితో పాటు నలుగురు వ్యక్తులు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం నామినేషన్ ప్రక్రియ, కార్యాలయం వెలుపల వీడియో కెమెరా లేదా సీసీటీవీ ద్వారా రికార్డు చేస్తారు. అభ్యర్థులు నామినేషన్లను ఆన్‌లైన్ లోనూ సమర్పించవచ్చు. ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ పోర్టల్ ద్వారా ఈ సదుపాయం ఉంది. ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించినప్పటికీ అభ్యర్థి దాని ప్రతిపై సంతకం చేసి నిర్ధిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి విధిగా అందించాల్సి ఉంటుంది. విదేశీ ఓటర్లు అక్కణ్నుంచే నామినేషన్ దాఖలు చేసినట్లైతే అక్కడి రాయబారి కార్యాలయాలు, కాన్సుల్ కార్యాలయాల్లో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్‌తో పాటు అఫిడవిట్ దాఖలు చేసి ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్ విధిగా నింపాలని... ఖాళీకి ఆస్కారం లేదని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. A ఫారం, B ఫారాలను నామినేషన్ల దాఖలుకు చివరి రోజు మూడు గంటల్లోపు ఇవ్వాలి. అభ్యర్థులు నిర్ధేశిత దరావత్తు అయిన పదివేల రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5000 డిపాజిట్ చెల్లించాలి.

ఎన్నికల వ్యయం కోసం అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలను కూడా నామినేషన్ తో పాటు సమర్పించాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థి అయితే ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇతరులకు పది మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. ప్రతిపాదకులు అందరూ అదే శాసనసభ నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలి. నామినేషన్ తో పాటు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ప్రతులను రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డుపై ఉంచాలి. అభ్యర్థుల అఫిడవిట్‌లను 24 గంటల్లోపు వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. అఫిడవిట్‌లో ఏవైనా ఖాళీలు ఉంటే ఆర్వో సదరు అభ్యర్థులకు నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లైతే దాన్ని కూడా వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. నామినేషన్ల దాఖలు సమయం నుంచే అభ్యర్థులు చేసే ఖర్చు ఎన్నికల వ్యయం పరిధిలోకి వస్తుంది. అప్పట్నుంచి అన్ని వివరాలను అభ్యర్థి నమోదు చేసి అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యయ పరిశీలకులు కూడా నేటి నుంచే రంగంలోకి దిగనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story