తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..

తెలంగాణ అసెంబ్లీ మంగళవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. బుధవారం శాసనమండలి సమావేశం కానుంది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు శాసనసభ ప్రారంభం అవుతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. నాలా చట్టానికి సవరణ, రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణలు, జీహెచ్ఎంసీ చట్టం - 1955.. సవరణ బిల్లులపై చర్చించి అసెంబ్లీ ఆమోదించనుంది.
క్యాబినెట్‌లో చేపట్టిన తీర్మానాలు అన్నిటినీ బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. నాలా చట్టానికి సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చేక్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు ఇటీవలి నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు సూచించింది. ధరణి పోర్టల్ ద్వారా సంబంధిత వివరాలను అందచేస్తూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తోంది. భూమార్పిడి సులభతరం చేస్తూ.. చట్ట సవరణకు మంత్రి మండలి నిర్ణయించింది. ఈ చట్ట సవరణకు మంగళవారం అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.
ఇక రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ చట్టం-1955కు సవరణ చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పాలకమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యానికి చట్టబద్దత కల్పిస్తూ సవరణ తీసుకురానున్నారు. ఇక వార్డు కమిటీల పనివిధానం.. వార్డుల రిజర్వేషన్‌కు సంబంధించిన అంశంలో చట్ట సవరణలు చేస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం.
మంగళవారం ప్రవేశపెట్టబోయే ఈ బిల్లులు అన్నింటిని అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత బుధవారం శాసనమండలిలో చర్చించి బిల్లులు పాస్ చేయించుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కరోనా నేపథ్యంలో గత శాసనసభ సమావేశాలు మధ్యలోనే నిలిచిపోయాయి. అందుకే ఇప్పుడు కూడా కేవలం రెండు రోజుల్లోనే ఈ సమావేశాలు కూడా ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com