Assembly: తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

Assembly: తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
X
6 రోజులపాటు 26 గంటలకుపైగా వాడివేడి చర్చ

శ్వేతపత్రాలతో మొదటి శాసనసభ సమావేశాలు వేడి ని రగిలించాయి. వాస్తవ స్థితిగతులను వెల్లడించాలన్న ఆలోచనతోనే శ్వేతపత్రాలు ప్రవేశ పెట్టినట్లు సర్కార్ పేర్కొంది. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు హామీల నుంచి తప్పుకొనేందుకు సాకులు వెతుక్కుంటున్నారని విపక్షం ఆక్షేపించింది. తొలి సమావేశాల్లో ఆరు రోజుల పాటు 26 గంటలకుపైగా అసెంబ్లీ భేటీ అయింది.

అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పాటైన రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశాలు ముగిశాయి. ఈ నెల తొమ్మిదో తేదీన ప్రారంభమైన సమావేశాలు... మూడు దఫాలుగా జరిగాయి. తొమ్మిదో తేదీన సభ్యుల ప్రమాణ స్వీకారాలు జరగగా 14 వ తేదీన సభాపతి ఎన్నిక జరిగింది. కొత్త అసెంబ్లీ మొదటి సమావేశాలు కావడంతో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ముఖ్యమంత్రి సమాధానం మరుసటి రోజు జరిగింది. బుధ, గురువారాల్లో జరిగిన మరో విడత సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రవేశపెట్టగా వాటిపై సభలో స్వల్ప కాలిక చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాటల యుద్ధం నెలకొనగా... శ్వేత పత్రాలు అసెంబ్లీలో వేడిని రగిల్చాయి.

రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం భారాస సర్కార్ చేసిన అప్పుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆక్షేపించింది. నీటిపారుదల, విద్యుత్, పౌర సరఫరాల సంస్థ అప్పులను ప్రధానంగా సర్కార్ ప్రస్తావించింది. మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రతి కుటుంబంపై 7 లక్షల వరకు రుణభారం మోపారని లెక్కలు కట్టింది.

రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం భారాస మండిపడింది. తమ హయాంలో అన్ని రంగాలను అభివృద్ధి పథాన నడిపామని, అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేక నెపాన్ని తమపై నెట్టి కుంటిసాకులు వెతికే ప్రయత్నమని ఆక్షేపించింది. విద్యుత్ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి, ప్రభుత్వం మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. చర్చలో భాగంగా విద్యుత్‌ రంగంపై న్యాయ విచారణ జరపాలన్న జగదీశ్‌రెడ్డి సవాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి స్వీకరించారు.

brs గొప్పల కోసం అప్పులు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చిందని bjp విమర్శించింది. నిధులు ఇస్తున్నప్పటికీ కేంద్రాన్ని నిందించడం తగదన్న ఆ పార్టీ సభ్యులుఎన్నికల హామీ మేరకు 200యూనిట్ల కరెంటు ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీయడం తగదన్న మజ్లిస్ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకోవాలని సూచించింది. చర్చ సందర్భంగా మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీకి... సీఎం, మంత్రులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆరు రోజుల్లో 2 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగ్గా నీటిపారుదల రంగంపై కూడా శ్వేతపత్రం ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం.... ప్రస్తుతానికి వాయిదా వేసింది. సభా వ్యవహారాల సలహా సంఘం లేకుండానే తొలి సమావేశాలు ముగిశాయి.

Tags

Next Story