TS:నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే, ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ నివేదికపై చర్చించేందుకు నేడు ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. సమావేశాలకు ముందు ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమై ఈ రెండు నివేదికలపై చర్చించి, ఆమోదించనుంది.
మంత్రివర్గ ఉప సంఘం చేతికి నివేదిక
ఇప్పటికే కేబినెట్ సబ్‌కమిటీకి ప్లానింగ్ కమిషన్ అధికారులు కులగణన నివేదిక అందజేశారు. బీసీ రిజర్వేషన్లను పెంచడం కోసం కీలక నిర్ణయం తీసుకుని, పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించి, ఆ తర్వాత కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయి. కులగణన సర్వేలో బీసీలు 55.85 శాతం ఉన్నట్లు సబ్‌కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం పథకాలు, రిజర్వేషన్ల అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేయనుంది. దీని కోసం న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రిజర్వేషన్లు అమలు చేయడానికి రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
కేసీఆర్ వస్తారా..?
శాసనమండలి, అసెంబ్లీలో తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ నివేదికలను ప్రవేశపెట్టి చర్చించనున్నారు. అయితే, ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
కేసీఆర్ అసెంబ్లీకి రావాలి: మంత్రి
బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు శాసనసభకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు. కుల గణనపై అన్ని రాజకీయ పార్టీలు తమ విధానం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బలహీనవర్గాల కోసం అన్ని పార్టీలు అసెంబ్లీలో తమ వాదన వినిపించాలని.. కులగణన ఒక ఉద్యమం తరహాలో చేశామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com