Bjp Uses RTI : టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతాం : బీజేపీ

Bjp Uses RTI : టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ దూకుడు మరింత పెంచింది. విజయ సంకల్ప సభకు ముందుగానే కమిటీల నియామకం జరగ్గా.. ఆ కమిటీలు చకచకా పనులు చేసుకుపోతున్నాయి.. టీఆర్‌ఎస్ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ఓవైపు అధ్యయనం చేస్తూనే.. ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీయడంలో భాగంగా ఆర్‌టీఐని ఆయుధంగా వాడుకుంటోంది బీజేపీ.
ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సందర్భాల్లో అసెంబ్లీ, మండలితో పాటు జిల్లాల్లో పర్యటించిన సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ ఆర్టీఐ దాఖలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీఎంవోతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ, ఏసీబీ, సంక్షేమ, పంచాయతీరాజ్, సాగునీటి, విద్యా, వైద్య శాఖలకు దాదాపు వంద ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేశారు. గత నెల 28నే వీటిని దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టడమే లక్ష్యంగా ఆర్టీఐకి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఆర్టీఐ దరఖాస్తులు చేస్తున్నారు బీజేపీ నేతలు. యువ మోర్చాల తోపాటు బీజేపీ నేతలు.. వివిధ అంశాలపై ఆర్టీఐ దరఖాస్తులు చేస్తున్నారు. వివిధ మీడియా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల వివరాలు కోరుతూ బీజేపీ ఉపాధ్యక్షులు మనోహర్‌రెడ్డి ఆర్టీఐ దరఖాస్తులు చేశారు.
ఇటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యయన కమిటీ భేటీ సమావేశం జరిగింది.. ప్రజాసమస్యలపై లోతుగా అధ్యయనం చేయాలని కమిటీ నిర్ణయించింది. సమస్యల అధ్యయనం కోసం అంశాల వారీగా నిపుణులను సంప్రదించాలని సమావేశంలో అభిప్రాయానికి వచ్చారు నేతలు.. గ్రామస్థాయి నుంచి సమస్యలను గుర్తించి నివేదిక సిద్ధం చేస్తామంటున్నారు. ప్రాథమికంగా మొత్తం 21 విభాగాల్లో సమస్యలను గుర్తించగా.. ఈనెల 14న మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించి ప్రజల ముందు ఉంచుతామని బీజేపీ నేతలంటున్నారు.
మరోవైపు మిషన్ తెలంగాణ పేరుతో సాలుదొర సెలవు దొర ప్రచారాన్ని బీజేపీ మరింత ఉధృతం చేస్తోంది.. ఇటు టీఆర్‌ఎస్ కవ్వింపు ప్రచారానికి దిగుతుండగా, అంతకు రెట్టింపు స్థాయిలో టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టేలా రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగులు, సోషల్ మీడియాలతో పాటలతో దూకుడు చూపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com