BJP Munugodu : మునుగోడు పైనే బీజేపీ ఫోకస్..

BJP Munugodu : మునుగోడులో బీజేపీ యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతోంది. మునుగోడులో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేస్తున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలంతా మునుగోడు తరలి రావాలంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఉప ఎన్నికకు ముందే పార్టీలో చేరికలపై దృష్టిసారించాలని బీజేపీ నిర్ణయించింది.
అటు మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి త్వరలోనే కమిటీ ఏర్పాటు చేయనుంది కమలదళం. ముఖ్యంగా సీనియర్ నేత జితేందర్ రెడ్డికే బాధ్యతలు ఇస్తారంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. మునుగోగడు ఉప ఎన్నికలో గనక గెలిస్తే.. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి బాటలు పడ్డట్టేనని కమలనాథులు భావిస్తున్నారు.
అయితే, మునుగోడులో బీజేపీకి బలం లేకపోవడం పెద్ద ప్రతికూల అంశంగా కనిపిస్తోంది. మునుగోడులో కాంగ్రెస్, కమ్యూనిస్టులు బలంగా ఉన్న నేపథ్యంలో.. ఓటర్లను తమవైపు తిప్పుకోవడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. తమవైపు బలమైన అభ్యర్ధి ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశం అంటోంది ఆ పార్టీ. పైగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే.. గెలిపించుకునే బాధ్యత తాము తీసుకుంటామని కోమటిరెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారనే టాక్ నడుస్తోంది.
కోమటిరెడ్డిని గెలిపించుకుని అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్‌కు మరో ఆర్ జోడించాలనుకుంటున్నారు. ఇప్పటికే రాజాసింగ్, రఘునందన్, ఈటల రాజేంద్రను ట్రిపుల్ ఆర్‌గా పిలుస్తున్నారు. ఫోర్త్ 'ఆర్' గెలుపునకు బీజేపీ నేతలు ప్రత్యేక వ్యూహం రచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com