BONALU: సంబురాల సింగారాలు.. తెలంగాణ బోనాలు

తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల పండుగ సందడి నేటి నుంచి ఆరంభం కానుంది. పల్లె, పట్నం అని తేడా లేకుండా ఆషాఢ బోనాలు వేడుకగా జరుగుతాయి. పండుగ రోజున గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, పోతరాజు వేషాలు, శివసత్తులు, డప్పుల చప్పుళ్లు వంటివి ఎటు చూసిన కనిపిస్తాయి. అసలు ఈ బోనాలు అనే మాట ఎత్తగానే మొదట గుర్తొచ్చేది మాత్రం పురాతన చరిత్ర కలిగిన హైదరాబాద్ బోనాలే. ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ బోనాలు ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి నిర్వహిస్తోంది. ఆషాఢమాసంలో ఒక్కో వారంలో ఒక్కో ప్రాంతంలో జరిగే బోనాలు అంతర్జాతీయంగా కూడా ఖ్యాతికెక్కింది. తెలంగాణలో బోనాల పండుగ కేవలం ఆషాఢ మాసంకే పరిమితం కాలేదు. పలు సందర్భాల్లో వేర్వేరు రకాల బోనాల నిర్వహణ ఇక్కడ కనిపిస్తుంది. కుండలో బోనం వండి దేవతలకు నైవేద్యం పెట్టే సంప్రదాయం ఉంది. పంటలు బాగా పండాలని, ఆరోగ్యాలు బాగుండాలని ప్రకృతికి తెలిపే ఒక రకమైన కృతజ్ఞతాభావం. ఈ బోనాలు పండుగలో మహిళలదే కీలక పాత్ర. ఈ పండుగలోని ఆచార, సంప్రదాయాలు మహిళ కేంద్రంగా ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంలో వచ్చే వ్యాధులను అరికట్టేలా కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా ఈ పండుగలో దాగి ఉన్నాయనేది జానపద చరిత్రకారుల అభిప్రాయం.
శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్రెడ్డి
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరుకున్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించే దిశగా అమ్మవారి దీవెనలు ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలతో తెలంగాణలో పండుగ వాతావరణం మొదలవుతుందని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాక్షించారు. చారిత్రాత్మక గోల్కొండలో వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఆషాడ మాసం తొలి బోనం సమర్పించడంతో జంటనగరాల్లో బోనాల సందడి నెలకొంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com