Telangana news: కూల్చివేతలపై డైలామాలో బీఆర్ఎస్
కూల్చివేతలపై బీఆర్ఎస్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి లా తయారైంది. హైడ్రా దూకుడు చర్యలపై మొదట్లో తీవ్రంగా స్పందించిన బీఆర్ఎస్ క్రమంగా తమ నాయకుల, సొంత భవనాలు టార్గెట్గా మారుతుండడంతో సైలెంట్ అయింది. కాంగ్రెస్ నాయకుల భవనాలను, ఫాంహౌజ్లను కూల్చే దమ్ముందా? అంటూ బీఆర్ఎస్ క్యాంప్ సోషల్ మీడియాలో ఎగిరెగిరి పడింది. తీరా కాంగ్రెస్ నాయకులు మావి కూడా ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో ఉంటే కూల్చండి అనడంతో గులాబీ నాయకులకు ఏం చేయాలో పాలు పోవట్లేదు.
అనుకున్నదొకటి.. అయితున్న దొకటి
ఓవైసీ బ్రదర్స్, సీఎం సోదరుడి భవనాలు కూల్చకుండా నోటీసులు ఇవ్వడం. తమ నాయకులైన కేటీఆర్, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి ఇలా బడా, చోటా నాయకులను ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. దీని వల్ల రేవంత్ పై ఆ పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతుందని అనుకుంది. కానీ ఏదీ జరగడం లేదు.. రివర్స్ లో సీఎం రేవంత్కు కూల్చివేతల విషయంలో అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. కొంత మంది హైడ్రాకు సపోర్ట్గా నినాదాలు, పాదయాత్రలు కూడా చేశారు. దీంతో ప్రజాస్పందన పాజిటివ్ గా ఉందని తేలడంతో కూల్చివేతల్ని వ్యతిరేకిస్తే కబ్జాదారులకు అండగా ఉన్నట్లేనన్న అభిప్రాయం గులాబీ దళంలో ఏర్పడుతుంది.
సమర్ధించలేక.. వ్యతిరేకించలేక
కూల్చివేతల్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందన్న ప్రచారం క్రమంగా ప్రజల్లోకి వెళ్తోంది. హైడ్రా కూల్చివేతలను బీజేపీ నాయకులు కొంతమంది బాహటంగా మెచ్చుకుంటున్నారు. కమ్యూనిస్టు పార్టీలు కూడా ప్రభుత్వ తీరును హర్షిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులకు సమర్థించాల లేక వ్యతిరేకించాల అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాత్రమే హైడ్రాను మెచ్చుకున్నారు.
అయితే చెరువుల్లో కబ్జాలు చేయగలిగేది రాజకీయ నాయకులే. వస్తున్న వార్తలను చూస్తే దాదాపు సగాని కంటే ఎక్కువగా కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టింది బీఆర్ఎస్లో ఉన్న చిన్న, పెద్ద లీడర్లే. అలాగని ఇతర పార్టీల నాయకులు శుద్ధపూసలని కాదు. డబ్బు, అధికారం అడ్డం పెట్టుకుని కనబడిన చెరువులను, నాలాలను ఆక్రమిస్తూ పోయారు. అడిగిన వాన్ని బెదిరించి తమ కబ్జాలను యధేచ్చగా సాగించారు. కూల్చివేతల్ని వ్యతిరేకించి రాజకీయం చేస్తే.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది . అలాగని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను సమర్థించలేరు. అందుకే రాజకీయంగా నష్టం జరిగినా కూల్చివేతల్ని వ్యతిరేకించాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. పేదలు, తమ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారని ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తంగా కూల్చివేతల విషయంలో ఓ స్టాండ్ తీసుకోలేక సందిగ్ధంలో పడిపోయింది బీఆర్ఎస్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com