TG: నేడే తెలంగాణ బడ్జెట్

TG: నేడే తెలంగాణ బడ్జెట్
X
భారీగా అంచనాలు... రూ. 3 లక్షల కోట్లకుపైనే బడ్జెట్ ఉండే అవకాశం

తెలంగాణ ప్రభుత్వం నేడు రెండోసారి శాసనసభసలో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు 2025-26 ఆర్థిక సంవత్సరానికి పద్దును ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి గ్రాంట్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఈ ఏడాది ఆదాయం లక్ష్యాల మేరకు రాలేదు.

గ్యారంటీలకే బడ్జెట్ లో భారీగా నిధులు

తెలంగాణ శాసనసభలో నేడు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జట్ లో గ్యారంటీ హామీలకు అధికంగా నిధులు కేటాయిస్తారని తెలుస్తోంది. మూసీ రివర్‌ఫ్రంట్, ఫ్యూచర్‌ సిటీ, మెట్రో రైలు విస్తరణ, RRR, రేడియల్‌ రోడ్ల నిర్మాణం వంటివాటికి కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. నీటిపారుదల, వ్యవసాయం, విద్య, రోడ్లు-భవనాలు, గృహనిర్మాణంశాఖలకు అత్యధికంగా నిధులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2024–25లో రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్​ను పెట్టగా.. ఈసారి రూ.3 లక్షల కోట్ల పైనే అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప వేరే సర్దుబాటు లేదు. కేంద్రం కూడా ఈసారి బడ్జెట్ ను గతం కంటే రూ.2.5 లక్షల కోట్లు మాత్రమే పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందా అనే ఆసక్తి నెలకొన్నది.

ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో.. ఆరు గ్యారెంటీ హామీలు ఇచ్చింది. వాటిలో చాలా వరకు అమలు చేసింది, ఇంకా చేస్తూ ఉంది. ఐతే.. అమలు చెయ్యని హామీలు చాలా ఉన్నాయి. అలాగే.. అమలు చేస్తున్న వాటిలో కూడా కొన్ని పథకాల విషయంలో గందరగోళం ఉంది. ఇవన్నీ ప్రతిపక్షాలు అస్త్రంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పద్దును పెంచడం ద్వారా.. ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

Tags

Next Story