Telangana Budget Session: మూడో రోజు కూడా విమర్శలు, ప్రతివిమర్శలతో తెలంగాణ అసెంబ్లీ..

Telangana Budget Session: తెలంగాణ అసెంబ్లీలో మూడో రోజు వివిధ పద్దులపై చర్చ జరిగింది. పద్దులపై చర్చలో మంత్రి కేటీఆర్... కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర ప్యాకేజీ అంతా బోగస్సేనన్నారు. అయితే జుమ్లా.. లేకపోతే హమ్లా అన్నట్లుగా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల ఎవరూ లబ్ది పొందలేదన్నారు. ఇక సీఎం కేసీఆర్ న్యాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి కేటీఆర్.
పద్దులపై చర్చలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి కేటీఆర్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ విమర్శలు చేయగా.. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం సంస్కారం కాదంటూ భట్టి అడ్డుచెప్పారు. బీజేపీ సభ్యుల సస్పెండ్‌పై ఆ పార్టీ అధ్యక్షుడి కంటే రేవంత్‌రెడ్డి ఎక్కువగా బాధపడ్డారని, ఇదేంటో మాకు అర్థం కావడం లేదని, అక్కడ గట్టి అక్రమార్కలదే నడుస్తోందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
బడ్జెట్‌లో కేటాయింపులు జరిగినా ఆ తర్వాత తగ్గించడం పరిపాటైందని శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలకు కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు చేసినపుడు ఆయా వర్గాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. పూర్తిగా వెనకబడిన నియోజకవర్గాలకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని కోరారు.
శాసనసభలో సంక్షేమ పథకాల పద్దుపై చర్చలో పాల్గొన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత... మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. బాలికల కోసం గురుకుల స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు కోఠి వుమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా మార్చడం గొప్ప విషయమన్నారు. విద్యార్తినులకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం ప్రశంసనీయమన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలను దృష్టిలో ఉంచుకుని మానవీయ కోణంలో పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. అందుకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపకల్పన చేయడమే గాక సంక్షేమ పథకాలకు అధికంగా నిధులు కేటాయించారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశ రూపురేఖలు మారే అవకాశం ఉందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేయడంతో తెలంగాణలో బాల్య వివాహాలను అరికట్టగలిగామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ రెండు పథకాల కింద 10 లక్షల 26 వేల 396 మంది లబ్ధి పొందినట్లు వెల్లడించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసి, కులవృత్తుల మీద ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పాడి పరిశ్రమ అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తలసాని సమాధానం ఇచ్చారు. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు 75 శాతం సబ్సిడీ, ఇతర లబ్దిదారులకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు.
సరళా సాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని శాసనసభలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇతర దేశాలతో పోటీ పడే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అసెంబ్లీ మూడోరోజు సమావేశంలో వివిధ పద్దులను మంత్రులు ప్రవేశపెట్టారు. వీటిపై చర్చ తర్వాత వాటిని ఆమోదించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com