ఇవాళ్టి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

ఇవాళ్టి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు
గవర్నర్‌ ప్రసంగం తరువాత తొలి రోజు సమావేశం ముగుస్తుంది. ఆ తరువాత బడ్జెట్‌ సమావేశాల అజెండా ఖరారు చేస్తారు.

ఇవాళ్టి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌ ప్రసంగం తరువాత తొలి రోజు సమావేశం ముగుస్తుంది. ఆ తరువాత బడ్జెట్‌ సమావేశాల అజెండా ఖరారు చేస్తారు. స్పీకర్, మండలి చైర్మన్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాలు జరిగే తేదీలు, సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన, అమోదించాల్సిన అంశాలు, బిల్లులను ఖరారు చేస్తారు. దాదాపు పది నుంచి 12 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు రేపు శాసనసభ సంతాపం తెలపనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఎల్లుండి చర్చ, ప్రభుత్వ సమాధానం ఉండే అవకాశం ఉంది.18న ప్రభుత్వం వార్షిక బడ్జెట్​ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఏసీ సమావేశంలో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత బడ్జెట్‌పై సాధారణ చర్చ, పద్దులపై చర్చతో పాటు ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ, ఆమోదం, ఇతర అంశాలపై ఉభయసభల్లో చర్చ ఉంటుంది.

కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం పడిపోయింది. అయితే, రాబోయే రోజుల్లో ఆర్థిక వృద్ధి బాగుంటుందని అంచనా వేస్తుండడంతో అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. చివరి మూడు నెలల ఆదాయ బాగుండడంతో ఆ అంచనాలతోనే రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్ ఖరారు చేసిన విధివిధానాలకు అనుగుణంగా అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలను తయారు చేశారు. కరోనా కారణంగా రాష్ట్రానికి రావాల్సిన రాబడి 50 వేల కోట్ల వరకు తగ్గిందని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గడంతో ఈ ఏడాది ఎక్కువగా అప్పులపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రుణాల మొత్తం 45వేల కోట్ల వరకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జాతీయస్థాయిలోనే 14శాతం వరకు వృద్ధిరేటు ఉంటుందన్న కేంద్రం అంచనాల నేపథ్యంలో.. రాష్ట్రంలోనూ అంతకంటే ఎక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలకు అనుగుణంగానే వార్షికపద్దు సిద్ధమవుతోంది. పూర్తి ఆశాజనకంగా, వాస్తవిక ధృక్పథంతో కొత్త బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కూడా ఆయా శాఖల అధికారులతో సమావేశమై ప్రతిపాదనలపై చర్చించారు. తుది కసరత్తు ఇంకా కొనసాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు ఖరారు కానున్నాయి. మరో మూడు లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ, దళితులకు సాధికారత, ఉద్యానవన పంటలకు ప్రత్యేక తోడ్పాటు, ఉద్యోగుల వేతన సవరణ, కొత్త ఫించన్లు, తదితరాలకు నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే సంక్షేమం, నీటిపారుదల, వ్యవసాయానికి కేటాయింపుల్లో ప్రాధాన్యత దక్కనుంది. కరోనా కారణంగా గత బడ్జెట్ సమావేశాలు అర్ధాంతరంగా ముగిశాయి. కాగ్ నివేదికను ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టలేదు. దీంతో ఈసారి రెండేళ్లకు సంబంధించిన కాగ్ నివేదికలను ఉభయసభల ముందు ప్రవేశపెడతారు.


Tags

Read MoreRead Less
Next Story