Telangana Budget 2022: తెలంగాణ బడ్జెట్‌కు ముహూర్తం ఫిక్స్.. భారీగా కేటాయింపులు..

Telangana Budget 2022: తెలంగాణ బడ్జెట్‌కు ముహూర్తం ఫిక్స్.. భారీగా కేటాయింపులు..
X
Telangana Budget 2022: వచ్చే సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో ఈ బడ్జెట్‌పై అంచనాలు పెరిగాయి. తెలంగాణ బడ్జెట్‌ ఎలా ఉండనుంది?

Telangana Budget 2022: తెలంగాణ బడ్జెట్‌కు ముహూర్తం ఫిక్సయింది. ఈనెల ఏడున అసెంబ్లీ ముందుకు రానుంది. బడ్జెట్‌ ప్రక్రియకు ఆర్థికశాఖ తుదిరూపు ఇచ్చింది. పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన ప్రభుత్వం... బడ్జెట్‌కు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది. వచ్చే సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో ఈ బడ్జెట్‌పై అంచనాలు పెరిగాయి. తెలంగాణ బడ్జెట్‌ ఎలా ఉండనుంది? రైతు బంధుకు కేటాయింపులు ఎలా ఉంటాయి? సంక్షేమ బడ్జెట్‌ కొనసాగుతుందా? అనేది చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికే తొలి ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ రూపకల్పన పూర్తి చేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ భారీగా ఉండేలా చూస్తూ, అదే నిష్పత్తిలో కేటాయింపులుండేలా ప్లాన్‌ చేసినట్లు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. తొలుత సంక్షేమ కార్యక్రమాలకు, తర్వాత వ్యవసాయానికి నిధుల కేటాయింపులు భారీగా ఉండనున్నాయి. ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళితబంధుకు వచ్చే బడ్జెట్‌లో 30వేల కోట్లను ప్రతిపాదించనున్నట్లు సమాచారం. ప్రస్తుత బడ్జెట్‌లో రైతు బంధుకు అత్యధికంగా 14వేల 800 కోట్లను కేటాయించగా ఈసారి కూడా అదే స్థాయిలో కేటాయింపులు దక్కనున్నాయి.

ఆసరా ఫించన్లకు 12వేల కోట్లను కేటాయించగా.. ఈసారి అర్హత వయస్సు 57 ఏళ్లకు తగ్గించడంతో కేటాయింపులు మరో రెండువేల కోట్ల దాకా పెరగనున్నాయి. రైతు రుణమాఫీకి 5వేల కోట్లకు పైగా ఇవ్వనున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లనిర్మాణం, వడ్డీలేని రుణాలు, కల్యాణలక్ష్మికి కేటాయింపుల్లో ప్రాధాన్యం మునుపటిలాగే దక్కనుంది. పట్టణాభివృద్ధితో పాటు గ్రామీణాభివృద్ధికి 15 శాతానికి పైగా నిధులు అదనంగా దక్కే అవకాశం ఉంది. ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి కూడా నిధులు పెంచేలా బడ్జెట్‌ కసరత్తు జరిగింది.

సాగునీటి రంగానికి 20వేల కోట్లకు పైగా నిధులు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రణాళిక నుంచి పదివేల కోట్ల వరకు కేటాయించనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతలకు 2వేల 500 కోట్లుగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనికి అదనంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మంజూరైన రుణం వినియోగించుకోనున్నారు. కాళేశ్వరం తర్వాత పాలమూరు-రంగారెడ్డికి ఎక్కువగా కేటాయించినట్లు సమాచారం.

సీతారామ ఎత్తిపోతల, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టులకు వెయ్యి కోట్లు, దేవాదుల ఎత్తిపోతలకు 350 కోట్లు కేటాయింపులు ఉన్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌ పనులను పూర్తి చేయడం, కొత్త పనుల్లో వేగం లక్ష్యంగా నిధుల కేటాయింపునకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 21వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. బ్యాంకుల నుంచి 13వేల 700 కోట్లు, రాష్ట్ర ఖజానా నుంచి 6వేల 500 కోట్లు వెచ్చించారు.

మరోవైపు తెలంగాణ రాబడుల లెక్క తేలింది. అమ్మకం పన్ను, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల రాబడి, ఎక్సైజ్‌ రాబడితో పాటు పన్నేతర రాబడి అంచనాలను 20 శాతం దాకా పెంచడంతో పాటు పన్నేతర రాబడిలో భూముల అమ్మకం ద్వారా 30 వేల కోట్ల రాబడిని అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నులశాఖ రాబడి 66 వేల కోట్లు దాటనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 80 వేల కోట్లుగా అంచనా వేసింది.

స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ రాబడి వచ్చే ఏడాది అంచనాలు 15వేల కోట్లుగా ఉన్నాయి. మద్యం అమ్మకాల ద్వారా రాబడి అంచనాలు 20 వేల కోట్లకు చేరాయి. బాండ్ల విక్రయం ద్వారా తీసుకునే రుణాల లక్ష్యం ఈసారి 47వేల 500 కోట్లుకాగా జీఎస్‌డీపీ పెరగడం, 4 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితితో రుణాలు పెరగనున్నాయి.

సంక్షేమం, ప్రాధాన్య కార్యక్రమాల అమలు, ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని పథకాలు, కార్యక్రమాలకు నిధులను వాస్తవ అవసరాలు ప్రాతిపదికగా ఇవ్వడమే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగిందని ఆర్థికశాఖ విభాగాలు స్పష్టం చేశాయి.

Tags

Next Story