TG: ఉగాదికే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ!

TG: ఉగాదికే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ!
X
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో తెలంగాణ నేతల కీలక భేటీ... మంత్రి వర్గ విస్తరణకు పచ్చజెండా ఊపిన అధిష్టానం..!

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో తెలంగాణ నేతల సుదీర్ఘ సమావేశం ముగిసింది. ఉగాది రోజున నాలుగు మంత్రి పదవులు భర్తీ చేయనున్నట్లు హస్తం పార్టీ వర్గాలు వెల్లడించాయి. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఢిల్లీ వెళ్లిన నేతలు..ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఈ ఆకస్మిక పర్యటన కేబినెట్ విస్తరణ గురించే అంటూ కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతకొన్ని రోజులుగా కేబినెట్‌ విస్తరణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం పలు దఫాలుగా చర్చలు జరుపుతూనే ఉంది. కొత్తగా వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మీనాక్షీ నటరాజన్ కూడా రాష్ట్రంలోని కీలక నేతలతో వ్యక్తిగతంగా భేటీ అవుతూ.. పరిస్థితులపై ఆరా తీశారు. దీంతో.. మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చిందని చర్చించుకుంటున్నారు.

వీరికి మంత్రి పదవులు ఖాయమేనా..?

తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం ఆరు మంత్రి పోస్టులు ఖాళీగా ఉండగా.. ఎవరెవరికి ఇవ్వాలన్న విషయంపై కూడా అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి, ఒక ముస్లిం, ఒక ఎస్సీకి అవకాశం లభించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. బీసీ కోటాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. రెడ్డి కోటాలో.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉండగా.. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీలు మీర్ అమీర్ అలీఖాన్‌, విజయశాంతి పేర్లు వినిపిస్తున్నాయి.

మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ అవుట్..?

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులను తొలగిస్తారంటూ సోషల్ మీడియాలో భారీ ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ, జూపల్లి కృ‌ష్ణారావును మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ విస్తరణ ఉత్కంఠ రేపుతోంది.

Tags

Next Story