ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే..!

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. దళిత బంధు మార్గదర్శకాలు, ఉద్యోగ ఖాళీల భర్తీ వంటి అంశాలే ముఖ్య ఎజెండా మీటింగ్ జరగబోతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశం వేడెక్కుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణ దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచే ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించడంతో.. పథకం మార్గదర్శకాల రూపకల్పన కోసం మంత్రిమండలి భేటీ అవుతోంది.
ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం కూడా ఫైనల్ చేయనుంది మంత్రివర్గం. రాష్ట్రంలో 56వేల 979 పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతంలో అధికారులు తేల్చారు. కానీ, జిల్లాల వారీగా, జోన్ల వారీగా ఖాళీలను మరోసారి సమీక్షించిన అధికారులు.. మరో సమగ్ర నివేదికను కేబినెట్ ముందుకు తీసుకురాబోతున్నారు. దీనిని కేబినెట్‌లో సమీక్షించి, ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగస్టు 15 నాటికి ఏదైనా ఒక నోటిఫికేషన్ వెలువరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.
చేనేత బీమా, వ్యవసాయ రంగం, పోడు భూములు, సాగునీటి పారుదల రంగంపైనా చర్చ క్యాబినెట్‌లో చర్చ జరగనుంది. కొత్త రేషన్‌కార్డులు, పింఛన్‌దారులకు ఇవ్వాల్సిన నిధుల విడుదలపైనా ఆదేశాలు జారీ చేయనుంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదల తరువాత మంగళవారం గోదావరి బోర్డు మొదటి సమావేశం నిర్వహించబోతోంది.
ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై మంత్రిమండలి చర్చించబోతోంది. ముఖ్యంగా పోతిరెడ్డిపాడుకు నీటి విడుదలను అడ్డుకోవాలంటూ కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో దీనిపై కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. కృష్ణా జలాల వాటాలను తేల్చేందుకు కొత్త ట్రైబ్యునల్‌ను వేయాలంటూ రాష్ట్రం ఇప్పటికే డిమాండ్ చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com