ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం

ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ముఖ్యంగా జీహెచ్‌ఎంసి ఎన్నికలు, ధాన్యం కొనుగోలు, రాష్ట్రంలో కరోనాతో ఏర్పడిన ఆర్ధిక ప్రభావంపై చర్చించనున్నారు. కేబినెట్ భేటీలో సన్న ధాన్యానికి మద్దతు ధర, బోనస్ నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్, సాదా బైనామాలతో పాటు రిజిస్ట్రేన్లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై మంత్రి వర్గం ఓ నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి వెబ్‌సైట్‌ను కూడా సీఎం సమీక్షిస్తారు.
అలాగే గవర్నర్ కోటాలో 3 ఎమ్మెల్సీలు, 2 గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థులపైనా కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఆదాయం గణనీయంగా తగ్గడంతో మంత్రులకు ప్రాధాన్యతలను వివరించనున్నారు సీఎం. ఏయే పథకాలకు ఎంత ఖర్చు పెట్టాలనే విషయంపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లోనే వచ్చే అవకాశం ఉన్నందునా.. వరద బాధితులకు పరిహారం త్వరగా అందించాలని కోరనుంది. జీఎచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రాపర్టీ టాక్స్, వాటర్ టాక్స్ తదితర వరాలపై మంత్రి వర్గం చర్చించనుంది. ఈ ఎన్నికల్లో అధిక సంఖ్యలో స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా డివిజన్ల వారీగా మంత్రులు, పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని కేబినెట్‌లో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com