Telangana Congress Govt : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Telangana Congress Govt :  తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి   ప్రమాణ స్వీకారం
వేదికపై ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక సహా సీనియర్ నేతలు

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్‌తో గవర్నర్‌ తమిళిసై ప్రమాణం చేయించారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రమాణం చేశారు.

అంతకుముందు జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి గుడికి కుటుంబ సమేతంగా వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. మర్గమధ్యలో గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. సోనియా గాంధీతో కలిసి పూల వాహనంపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ వేదికపైకి వెళ్లారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్, ప్రియాంక, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లను వేదికపైకి రేవంత్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు రేవంత్ రెడ్డి స్వాగతం పలికి, వేదికపైకి తోడ్కుని వచ్చారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్రా, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుక్విందర్‌ సుఖు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. రాష్ట్ర ఏర్పడిన తరువాత రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వచ్చింది. కానీ..తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే పట్టుదల నెరవేరేందుకు దాదాపు 10ఏళ్ల పట్టింది.

Tags

Read MoreRead Less
Next Story