KCR : కేంద్రమంత్రి పియూష్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌

KCR : కేంద్రమంత్రి పియూష్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌
KCR : పంజాబ్‌ తరహాలో తెలంగాణలోనూ పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటోంది కేసీఆర్‌ సర్కారు.

KCR : ధాన్యం కొనుగోళ్ల అంశంపై.. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య యుద్ధం నడుస్తంది. పంజాబ్‌ తరహాలో తెలంగాణలోనూ పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటోంది కేసీఆర్‌ సర్కారు. ఈ అంశంపై కేంద్రంతో పోరుకు సిద్ధమైన సీఎం కేసీఆర్‌... ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డిలతో ప్రగతి భవన్‌లోభేటీ అయ్యారు. కేంద్రం వ్యవహరించిన తీరుపై కేసీఆర్‌కు వివరించారు మంత్రులు.

కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తమ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల నిర్లక్ష్యంగా, అవమానకరంగా వ్యవహరించిన తీరును కేసీఆర్‌‌కు వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలు వరి వేయండి.. రాష్ట్రం ప్రభుత్వం ఎలా కొనదో చూస్తామని రైతులను రెచ్చగొట్టారంటూ పీయూష్‌ గోయల్‌కు వివరిస్తే... ఇది టీఆరెస్ - బీజేపీ మధ్య గొడవని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవ కాదంటూ పీయూష్‌గోయల్‌ వ్యాఖ్యానించినట్లు సీఎం కేసీఆర్‌కు తెలిపారు మంత్రులు.

దీంతో కేంద్రమంత్రి తీరుపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు కేసీఆర్‌. దీంతో కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేలా మంత్రులతో చర్చించారు. ధాన్యం కొనుగోలు విషయంలో పంచాయితీల తీర్మానాన్ని వీలైనంత త్వరగా నేరుగా ప్రధాని మోదీకి చేరవేయాలని సూచించారు. ఉగాది తర్వాత కేంద్ర ప్రభుత్వంపై మరింత దూకుడుగా వ్యవహరించేలని ఇందుకోసం త్వరలోనే కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

మరోవైపు.... కేంద్రమంత్రి పీయూష్ గోయ‌ల్‌పై మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. పీయూష్‌గోయల్‌... తెలంగాణ ప్రజానీకానికి క్షమాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజ‌ల‌ను అవమాన‌ప‌రిచేలా, కించ‌ప‌రిచేలా మాట్లాడిన గోయ‌ల్‌కు బుద్ధి చెప్పాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌న్నారు. కేంద్ర మంత్రి వెలికి వేషాలు మానుకోవాల‌ని హెచ్చరించారు. అటు... తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. బీజేపీని అప్రతిష్టపాలు చేసేందుకే టీఆర్ఎస్ కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారాయన. వడ్ల కొనుగోలు మొదటి నుంచి కేంద్రానిది ఒకే మాట అన్నారు. తెలంగాణ రైతులను టీఆర్ఎస్ బలి చేస్తోందన్నారు.

కేంద్రం రా రైస్ మాత్రమే కొంటామని స్పష్టం చేయడంతో ఆలోచనలో పడింది కేసీఆర్‌ సర్కారు. మిగిలిన ధాన్యం విషయంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నదానిపై కసరత్తు చేస్తోంది. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే వాటిని ఫర్బోయిల్డ్ మిల్లర్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు ప్రైవేట్ వారికి సప్లై చేయాలని భావిస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని రౌండప్‌ చేయాలని కేసీఆర్‌ సర్కారు చూస్తే..... కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిందన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story