తెలంగాణ

KCR Review On Drugs : గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపండి : సీఎం కేసీఆర్‌

KCR Review On Drugs : గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు.

KCR Review On Drugs : గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపండి : సీఎం కేసీఆర్‌
X

KCR Review Drugs : గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఒక వైపు రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తుంటే మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ పీడను తొందరగా తొలగించకపోతే సాధిస్తున్న విజయాలు వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం వుందన్నారు. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలని సూచించారు. పెడతోవ పట్టిన యువత గంజాయి గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్ ద్వారా మేసేజ్‌లు అందజేసుకుని గంజాయి సేవిస్తున్నారని నివేదికలు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు.

అమాయకులైన యువకులు తెలిసీ తెలియక గంజాయి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డి అడిక్షన్ చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ అని.... దీన్ని నిరోధించడానికి కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని అధికారులకు తెలిపారు. గంజాయి మాఫీయాను అణిచివేయాలి, నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించవలసిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక గంజాయిని నిరోధించడానికి డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. విద్యా సంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. స‌రిహ‌ద్దుల్లో చెక్ పోస్టుల సంఖ్యను పెంచి... సమాచార వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు తగినన్ని వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంటలిజెన్స్ శాఖలో కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గంజాయి నిర్మూలనలో ఫలితాలు సాధించిన అధికారులకు క్యాష్ రివార్డులు, ప్రత్యేక ప్రమోషన్లు, మొదలైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రతిష్టను కాపాడే విధంగా ఎక్సైజ్, పోలీస్ శాఖలు ఉమ్మడిగా పనిచేసి గంజాయి విత్తనాలు కూడా కనిపించనంత కట్టుదిట్టంగా పనిచేయాలన్నారు సీఎం కేసీఆర్‌. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Next Story

RELATED STORIES