KCR Review : భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. ఇవాళ, రేపు జీహెచ్ఎంసీలో హై అలర్ట్ ..!

భారీ వర్షాలపై సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్లతో ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గులాబ్ తుఫాను ప్రభావం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని కేసీఆర్ సూచించారు.
భారీ వర్షాలతో హైదరాబాద్ మరోసారి అతలాకుతలమైంది. మరో ఐదారు గంటల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనం రోడ్లపైకి రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎవరైనా బయట ఉంటే... వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ, రేపు కూడా గ్రేటర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు.
గ్రేటర్ మొత్తాన్ని కారుమబ్బులు అలుముకోవడంతో... చీకటిని తలపిస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ వరద నీటిలో జీవిస్తున్నారు. పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాలు నీట ముగినిగాయి. ఇటు బహీరాబాగ్, నాంపల్లిలో కూడా కుంభవృష్టి కురుస్తోంది. అపార్ట్‌మెంట్లలోని సెల్లార్‌లోకి వరద నీరు చేరింది. మోకాళ్లలోతు నీళ్లలో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కొన్ని గంటల్లోనే కురిసిన భారీ వర్షానికి నగరంలో జల ప్రళయం నెలకొంది. మేడ్చల్, కాప్రాలో పరిధిలో 7 సెం.మీవాన కురిసింది. మాదాపూర్, బంజారాహిల్స్‌లో 5.9 సెం.మీ.., హయత్‌నగర్, నాచారం, మలక్‌పేట్, బండ్లగూడ సహా అన్ని చోట్లా 5 సెం.మీ పైగా వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవాళ, రేపు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో 040-23202813 కంట్రోల్‌రూమ్‌కు సమాచారం ఇవ్వాలని GHMC కోరింది.
ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, చోలీచౌక్‌లో భారీ వర్షానికి జనం అగచాట్లు పడుతున్నారు. రోడ్లపై నీటిలో వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి మొదలైన వాన... 18 గంటలైనా తగ్గడంలేదు. ఇటు తెలంగాణలో 13 జిల్లాల్లో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది.
ఇక భారీ వర్షాల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీలో మంగళ, బుధవారాల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సవరించిన పరీక్ష తేదీలను తమ వెబ్ సైట్‌లో పొందుపరచనున్నట్లు తెలిపారు. ఈ నెల 30 నుంచి జరగాల్సిన ఇతర పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com