KCR: నిజమైన పాలమూరు బిడ్డల కల

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి KCR ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు. ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సాగు, తాగునీటి, పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్‌లో పంప్‌హౌస్ కంట్రోల్ రూంలో మొదటి పంపును స్విచాన్ చేయడం ద్వారా శ్రీశైలం వెనుక జలాలను ఎత్తిపోసే ప్రక్రియకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం కొల్లాపూర్ సింగొటం చౌరస్తాలో జరిగే బహిరంగసభకు హాజరుకానున్నారు.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన నాగర్‌కర్నూల్ చేరకోనున్న కేసీఆర్... అక్కడే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అనంతరం కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ పంప్‌హౌస్ కంట్రోల్ రూం వద్దకు చేరుకుంటారు. తొలుత పాలమూరు-రంగారెడ్డి పథకం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మొదటిదశ పంపింగ్‌ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. అక్కడే మొక్కలు నాటుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్విచ్ ఆన్ చేయగానే... శ్రీశైలం వెనుక జలాల నుంచి అప్రోచ్ కెనాల్, ఇంటెక్ వెల్, సొరంగమార్గాల ద్వారా అప్పటికే సర్జ్‌పూల్‌కు చేరిన కృష్ణా జలాలు మొదటి పంపు నుంచి డెలివరి సిస్టర్న్ ద్వారా నార్లాపూర్ జలాశయానికి చేరుకుంటాయి.
కృష్ణమ్మ పొంగి పాలమూరు గడ్డపై అడుగుపెట్టే నార్లాపూర్ జలాశయం డెలివరి సిస్టర్న్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కృష్ణమ్మకు గంగాహారతి చేపడతారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నార్లాపూర్ జలాశయానికి చేరిన కృష్ణా జలాలను ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల గ్రామాలకు చేర్చాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు కలశాలల్లో కృష్ణా జలాలను నింపి గ్రామదేవతల కాళ్లు కడిగి, అభిషేకాలు చేయనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత పథకం ప్రారంభోత్సవ దృశ్యాలను బహిరంగసభ వేదిక వద్ద అందరికి కనిపించేలా భారీ తెరల ద్వారా ప్రజలకు చూపించనున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను జాతికి అంకితం చేసిన అనంతరం కొల్లాపూర్ సమీపంలోని సింగోటం కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు.ముఖ్యమంత్రి సభకు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com