KCR Yadadri Tour : ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఆలయ పున:ప్రారంభ ముహూర్తాన్ని ప్రకటించే ఛాన్స్..!

KCR Yadadri Tour : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని ఇవాళ సీఎం కేసీఆర్ మరోసారి సందర్శించనున్నారు. ఉదయం 11.30కు హైదరాబాద్ నుండి బయలుదేరి వెళతారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తి స్థాయిలో ముగిసిన నేపథ్యంలో మరోసారి పర్యటనలో కేసీఆర్ పరిశీలిస్తారు.
ఇటీవల ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామిని కలిసిన సీఎం.. ఆలయ ఉద్ఘాటనపై చర్చించి ముహుర్తాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే గడువులోగా ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని వైటీడీఏ అధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ యాదాద్రిలో పనుల పురోగతిని కేసీఆర్ పరిశీలించనున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులతో సమీక్షించనున్నారు. యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు చినజీయర్ స్వామి నిర్ణయించిన తేదీలను, మహా సుదర్శన యాగం తేదీలను స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయమైన యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్ నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకోసం 2016లో పనులను ప్రారంభించారు. ఐదేళ్ల పాటు సాగిన ఆలయ పునర్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రధాన ఆలయం పనులు పూర్తయ్యాయి. పూర్తిగా రాతి కట్టడాలు, కృష్ణ శిలలతో నిర్మించారు. కొత్తగా ఆలయంలో ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థ సైతంఆకట్టుకుటోంది. ఇప్పటికే రోడ్ల వెడల్పు పనులతో పాటు పుష్కరిణి, వ్రత మండపం పనుల నిర్మాణం వేగంగా జరిగాయి.
యాదాద్రి ఆలయం పున: ప్రారంభ కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించారు సీఎం కేసీఆర్. ఆయన కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారు. ప్రధానితో పాటు అనేకమంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే యాదాద్రిలో పెండింగ్ పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని యోచిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com