Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

సినీ నటుడు అల్లు అర్జున్ నివాసానికి ఓయూ జేఏసీ పేరిట కొందరు విద్యార్థులు వెళ్లి నిరసన వ్యక్తం చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటికి కొందదరు వ్యక్తులు వెళ్లి రేవతి మృతికి సినీ నటుడు బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇంటి ప్రాంగణంలోని పూల కుండీలను పగలగొట్టడంతో పాటు, ఇంటిపైకి టమోటాలు, రాళ్లు విసిరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్పందించారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అల్లు అర్జున్ ఇంటిపై స్పందించిన కిషన్ రెడ్డి
అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు దాడి చేసిన దాడి ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఇది రాష్ట్రంలోని శాంతి భద్రతలను దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలోని పౌరులకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ అసమర్థ పరిపాలనకు ఇదొక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళాకారులను, సినీ పరిశ్రమను టార్గెట్ చేయడం ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు.
అల్లు అర్జున్ ఇంటి వద్ద టెన్షన్
జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. రేవతి మరణానికి అల్లు అర్జున్ బాధ్యుడని ఆరోపిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో బన్నీ ఇంటి మీద రాళ్లను విసిరారు. అదేవిధంగా ఆయన ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసం చేశారు. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అక్కడ మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com