CM Revanth Reddy: సెలవులు పెట్టోద్దు.. రద్దు చేసుకోండి

CM Revanth Reddy: సెలవులు పెట్టోద్దు.. రద్దు చేసుకోండి
X
అత్యవసర విభాగాలు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం అప్రమత్తం అయింది. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మంత్రులు అధికారులతో నిత్యం సమీక్షిస్తూ ఉన్నారు. కాగా వరదలపై అప్రమత్తంగా ఉండాలని ఇదివరకు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. గంట గంటకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘అధికారులు సెలవులు పెట్టొద్దు. సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని, పనుల్లో నిమగ్నం కావాలి. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ.. సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంవోకు పంపాలి’ అని తెలిపారు. వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

అధికారులు.. మంత్రులు స్థానికంగా ఉండాలి

డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల, దామోదర్‌ రాజనర్సింహ, జూపల్లి తదితరులతో మాట్లాడి వరద పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ‘‘సీఎస్, డీజీపీ, మున్సిపల్, విద్యుత్తు, పంచాయతీరాజ్, హైడ్రా, ఇరిగేషన్‌ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్‌ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయ ఏర్పాట్లు చేపట్టాలి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఉండాలి. ఏ అవసరం ఉన్నా.. అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వండి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టాలి’’ అని సీఎం రేవంత్‌ ఆదేశించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా సూచించారు.

భవిష్యత్ అవసరాల కోసం .. నీటిని నిల్వ చేయాలి

భారీ వర్షాలతో వచ్చిన నీటిని వృథా చేయకుండా.. భవిష్యత్‌ అవసరాలకు వినియోగించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్‌ చేయాలి. నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా లిఫ్ట్‌ చేసి రిజర్వాయర్లు నింపాలి. మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు డ్యామ్‌లతో పాటు.. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్‌ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్‌ చేయాలి.

Tags

Next Story