REVANTH: మెరుగైన పౌష్టికాహారం అందించాలి

తెలంగాణలోని సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పది రోజుల్లో విద్యార్థులకు కొత్త డైట్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్దేశించారు. దీనికి సంబందించిన మార్పులు, చేర్పులు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళాశిశు సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు, సాధారణ గురుకులాల్లో చదువుతున్న, ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతూ ఎస్సీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పెరిగిన డైట్‌ఛార్జీలు నవంబరు 1 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఛార్జీలు అమలయ్యేలా సంక్షేమశాఖల కమిషనర్లు, గురుకుల సొసైటీల కార్యదర్శులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది.
రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన విద్యాశాఖ
ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వివిధ సంక్షేమ విభాగపు సెక్రేటరీలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దీపావళి కానుకగా రాష్ట్రంలో అన్ని గురుకుల విద్యా సంస్థలు, ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు డైట్ చార్జీలను భారీగా పెంచింది. దీంతో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, మైనార్టీ గురుకుల కార్యదర్శి తఫ్సీర్ ఇక్బాల్ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వసతిగృహాలు, సంక్షేమ గురుకులాల విద్యార్థులు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులతో కలిసి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.
కమిటీ ఏర్పాటుచేసి..
ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న డైట్‌ఛార్జీలు 2016-17లో పెంచినవని.. నిత్యావసరాలైన కూరగాయలు, వంటనూనెలు, చక్కెర, ఆహారధాన్యాలు, గ్యాస్ వంటివాటి ధరలు భారీగా పెరిగినందున డైట్‌ఛార్జీలు పెంచాల్సిన అవసరముందని ఎస్సీ సంక్షేమశాఖ కమిషనర్ 2022, 2023, 2024 సంవత్సరాల్లో ప్రభుత్వానికి తెలిపారు. కాగా 2024 జులై 18న చేసిన ప్రతిపాదనపై కొత్త ప్రభుత్వం ఉన్నతాధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ గత ఏడేళ్ల నిత్యావసరాల ధరలు, నవోదయ విద్యాలయాల్లో అమలవుతున్న ధరలను పరిగణనలోకి తీసుకుని డైట్‌ఛార్జీలు 40%, కాస్మెటిక్‌ఛార్జీలు మార్కెట్ విలువ ప్రకారం పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు.
కాస్మోటిక్ డైట్ చార్జీల పెంపుతో సంబరాలు
రేవంత్ ప్రభుత్వం గురుకుల కళాశాలలు, పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల దృష్టిలో ఉంచుకొని డైట్ కాస్మోటిక్ చార్జీలు పెంచినందుకు శామీర్ పేటలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. పేద విద్యార్థులకు ప్రభుత్వాన్ని నిర్ణయంతో ఎంతో ప్రయోజనం జరిగిందని పలువు ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
నేడు కేరళకు సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కేరళకు వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు. AICC నేత శ్రీనివాస్ కృష్ణన్ కుమారుడి వివాహానికి ఆయన హాజరుకానున్నారు. అంతకముందు సీఎం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో 9 యూనివర్సిటీల వీసీలు, ఉన్నత విద్యామండలి చైర్మన్ సహా ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమావేశం కానున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com