REVANTH: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యడమే కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కలెక్టర్లదేనని, వారి పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానం అని అన్నారు.
ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కలెక్టర్లకు రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26 నుంచి పథకాలను అమలు చేయాలని, వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. పథకాల అమలుపై గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో సభలు నిర్వహించాలన్నారు. ఈ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది . ఆకస్మిక తనిఖీల్లో భాగంగా జనవరి 26 వ తేదీ అనంతరం జిల్లాల పర్యటనకు వస్తానని తెలిపారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ప్రతి ఎకరాకు రైతు భరోసా
సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా చెల్లిస్తామన్నారు. పంట వేసినా, వేయకపోయినా సాగుకు అనుకూలమైన భూమికి మాత్రం రైతు భరోసా ఇవ్వాల్సిందే అన్నారు. అనర్హులకు మాత్రం రైతు భరోసా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను, అనర్హులను గుర్తించాలన్నారు. స్థిరాస్తి భూములు, లేఅవుట్లు, నాలా కన్వర్షన్, మైనింగ్, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను సేకరించాలన్నారు.
కలెక్టర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం సీరియస్ అయ్యారు. 'డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచినా ఇలాంటి సంఘటనలు జరగడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కలెక్టర్లు స్కూళ్లను తనిఖీ చేయకపోవడమే ఈ ఘటనలకు కారణమవుతున్నాయి. ఇక నుంచి ప్రతివారం ప్రభుత్వ, రెసిడెన్షియల్ స్కూళ్లను కలెక్టర్లు తనిఖీలు చేసి రిపోర్ట్ ఇవ్వాలి' అని సీఎం ఆదేశించారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా… చెడ్డపేరు వచ్చినా కలెక్టర్ల పెర్ఫామెన్సే కీలకం కనుక.. కొత్త పథకాల అమలుపై దిశానిర్దేశం కోసం కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పెషల్ క్లాస్ తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com