REVANTH: ఉద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలే తీసుకుంటాం
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని నిరుద్యోగులకు సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మార్చితే తలెత్తే చట్ట పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసినట్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా.. ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని గుర్తు చేశారు. ఏళ్లుకు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటిని అధిగమించిందని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు ఏర్పడకుండా నిరుద్యోగులకు పూర్తి న్యాయం జరిగేలా క్యాలెండర్ రూపొందిస్తామన్నారు. ఇంత కీలకంగా తమ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో కసరత్తు చేస్తుంటే కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కొందరు చేసే కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ నిలిచిపోయి, నిరుద్యోగులు మరింత నష్టపోతారని సీఎం స్పష్టం చేశారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ హర్షవర్ధన్‌రెడ్డి, ఓయూ విద్యార్థి నాయకులు చనగాని దయాకర్, మానవతారాయ్, బాల లక్ష్మి, చారకొండ వెంకటేష్, కాల్వ సుజాతలతో రేవంత్ సమావేశమై చర్చించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్లు, జరుగుతున్న ఆందోళనలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు. నిరుద్యోగులు లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com