REVANTH: ఫ్యూచర్‌సిటీ వరకు మెట్రో విస్తరణ!

హైదరాబాద్ మెట్రోను ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ విస్తరణకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మెట్రో విస్తరణపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ముఖ్యమంత్రి ఆరా తీశారు.
కేంద్ర అనుమతులు పెండింగ్
కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వివరించారు. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయదుర్గం - కోకాపేట నియోపోలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్ - పటాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ నగర్ - హయత్‌నగర్ (7.1 కి.మీ.) మొత్తం కలిపి 76.4 కి.మీ.ల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.
మీర్‌ఖాన్ పేట వరకు మెట్రో..
ఫ్యూచర్ సిటీ దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతుండగా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెట్రోను మీర్ ఖాన్ పేట వరకు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విస్తరణ బాధ్యతను హెచ్‌ఎండీఏ (HMDA), ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FSDA) సంయుక్తంగా చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 24,269 కోట్ల అంచనాతో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి భాగస్వామ్య పద్ధతిలో చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజినల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com