TG: మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే: సీఎం

TG: మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే: సీఎం
X
స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష నేతలను త్వరగా అరెస్ట్‌ చేసే యోచన లేదని స్పష్టీకరణ

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదన్న రేవంత్.. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలనే దానిపై కాంగ్రెస్ అధిష్టానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదని స్పష్టం చేశారు. కుల గణన ఆషామాషీగా చేయలేదని.. పకడ్బందీగా చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర అవుతున్నా ఇంత వరకు ఖాళీగా ఉన్న మంత్రివర్గాన్ని విస్తరించలేదు. వాటి కోసం ఎంతో మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం నడుస్తోంది. కానీ ఆ ఒక్కటి తప్ప అన్నట్టు ఆయన తిరిగి వస్తున్నారు.

పక్కా ప్రణాళికతో బరిలోకి..

స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నేతలకు దిశానిర్దేశం చేసింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేపట్టినందుకు రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, ఖర్గేను పిలవాలని నిర్ణయించారు. దీనిపై చర్చించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రివర్గ సహచరులు, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీ బాట పట్టారు.

అరెస్ట్ చేయాలన్న తొందరేం లేదు

ప్రతిపక్ష నేతలపై ఉన్న కేసుల్లో జరుగుతున్న విచారణ గురించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలను త్వరగా అరెస్ట్ చేసి లోపల వేయాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలపై ఉన్న కేసుల విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోందని వెల్లడించారు. పీసీసీ కార్యవర్గ కూర్పు ఒక కొలిక్కి వచ్చిందన్న రేవంత్.. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు.

మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ

ఢిల్లీలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి పార్లమెంట్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై త్వరలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం అందించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.


Tags

Next Story