REVANTH: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం దృష్టి
తెలంగాణలో మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ లను చెల్లించేందుకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ విధానం అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయా కళాశాలలకు రూ.7 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా వీటిలో ఇంజినీరింగ్ కళాశాలలకు 70 శాతం వరకు చెల్లించాలి. తమకు పెండింగ్ బకాయిలను చెల్లించాలని యాజమాన్యాలు చాలారోజులుగా కోరుతుండగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బకాయిలపై ఎవరూ ఊహించని విధంగా వన్‌టైం సెటిల్‌మెంట్ గురించి జేఎన్‌టీయూహెచ్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. మొండి బకాయిలకు సంబంధించి కళాశాలల యాజమాన్యాలు ఓటీఎస్ విధానాన్ని ప్రతిపాదిస్తూ ముందుకొస్తే మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబులు సమస్యకు పరిష్కారం చూపే అవకాశముందని ఆయన సూచించారు. బకాయిపడిన మొత్తంలో కొంత తగ్గించి చెల్లించే అవకాశమున్నట్లు యాజమాన్యాలు భావిస్తున్నాయి.
త్వరలో జాబ్ క్యాలెండర్
త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు తెప్పించి జూన్ 2న నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబరు 9లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ అంశాన్ని అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని... కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు పోటీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాయని రేవంత్ అన్నారు. పదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని... ఇప్పుడు పక్కాగా డీఎస్సీ, గ్రూప్ 2, 3 నిర్వహిస్తుంటే వాయిదా వేయాలంటున్నారు. ఏ పరీక్షలూ రాయనివారు దీక్షలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.
జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య’కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సెప్టెంబరు 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ఏఐ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ 2024’ లోగోను ఆవిష్కరించారు. ఏటా లక్ష మంది ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసుకొని ప్రపంచంతో పోటీ పడేందుకు వస్తున్నప్పుడు ఆ దిశగా ప్రభుత్వ విధానాలు ఉండాలని భావిస్తున్నామని, అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటుచేశామని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైనది సివిల్ ఇంజినీరింగ్ అని రేవంత్ అన్నారు. కొన్ని కళాశాలలు ఈ కోర్సును నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ఆ విద్యా సంస్థల్లో ఆ కోర్సు లేకుండా ఉండేలా పథకాలు వేస్తున్నాయని.... సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులు కచ్చితంగా నడపాలని రేవంత్ అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com