REVANTH: బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి సవాల్

REVANTH: బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి సవాల్
X
దావోస్ పెట్టుబడులపై నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి.. అసలు శ్వేతపత్రం అంటే తెలుసా అని నిలదీత

దావోస్ లో తాము చేసుకున్న ఒప్పందాల వివరాలన్నీ ఇప్పటికే ప్రకటించామని.. వాటిపై ఏమైనా అనుమానాలు ఉంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ‘ప్రజల సొమ్మును కొల్లగొట్టి ఈ ఫార్ములా రేస్ పేరుతో ఇక్కడి సొమ్మును విదేశాలకు పంపి అక్కడ పెట్టుబడులు పెట్టుకున్నారు. ఒకాయనకు ప్రజల అటెన్షన్ డ్రా చేయాలనే కోరిక ఉంది. మరొకరు ఆయన్ని అనుసరిస్తున్నారు. వాళ్లు వెళ్లినప్పుడు ఇన్ని పెట్టుబడులు రాలేదు. మాకు ఎలా వచ్చాయని BRS నేతలు బాధపడుతున్నారు’ విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ పిచ్చోడు.. తిక్కలోడని ఎద్దేవా చేశారు. అసలు ఆయనకు శ్వేతపత్రం అంటే అర్థం తెలుసా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఒప్పందాలు రహస్యంగా చేసుకుంటే, అప్రకటిత సమాచారం ఏమైనా ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని అడుగుతారన్నారు. కేటీఆర్‌ అటెన్షన్‌ సీకింగ్‌ డిజార్డర్‌ తో బాధ పడుతున్నారని వ్యాఖ్యానించారు. సింగపూర్‌, దావోస్‌ పర్యటనల అనంతరం ఇటీవలే నగరానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క, టీఎ్‌సఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

స్పష్టమైన విధానం ఉంది..

తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం, నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉన్న కారణంగానే ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై విశ్వాసం, నమ్మకంతో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార విస్తరణతో పాటు ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి ముందుకొచ్చిన సంస్థలకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడుల మీద అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ విష ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలని బీఆర్‌ఎస్‌ కుట్రలు పన్నుతోందని రేవంత్‌ ఆరోపించారు. తాము విపక్షంలో ఉండగా ఏనాడూ అలా ప్రవర్తించలేదని, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే వ్యతిరేకించలేదని అన్నారు. సింగపూర్‌తో చేసుకున్న నైపుణ్యాల అభివృద్ధి ఒప్పందం యువతకు భారీ ఎత్తున ఉపాధి కల్పించబోతోందని చెప్పారు.

ఆర్. ఎస్. ప్రవీణ్‌పై సంచలన వ్యాఖ్యలు

ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్. ఎస్. ప్రవీణ్‌ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ‘ ఫిర్యాదు చేసిన వ్యక్తిది బానిస మనస్తత్వం. ఆయన ఆలోచన విధానం అందరికీ తెలుసు. ఏదో ఒక రోజు ఆ బానిస సంకెళ్ల నుంచి తెంచుకోవాలని కోరుకుంటున్నాను. ’ అని వ్యాఖ్యానించారు.

Tags

Next Story