REVANTH: 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం: రేవంత్

తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్, ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు చెప్పాను. నేను చెప్పినట్టే కేసీఆర్ ఉద్యోగం పోయింది.. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి’’. అని పేర్కొన్నారు.
దసరా వేళ ఆనందంగా ఉండాలనే..
దసరా పండగ నేపథ్యంలో తెలంగాణలో ప్రతీ కుటుంబంలో ఆనందం చూడాలనే మరిన్ని నియామక పత్రాలు అందిస్తున్నామని రేవంత్ అన్నారు. 1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. మీ చప్పట్లలో మీ సంతోషం, మీ కుటుంబ సభ్యుల ఆనందం కనిపిస్తుందని రేవంత్ తెలిపారు. ఏళ్లుగా నిరీక్షించిన మీ కల సాకారమవుతోందని... వందలాది మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. అలాంటి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారని... ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. ఇది భావోద్వేగమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. లక్షలాది మంది హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారో మీ ఇష్టం
హైదరాబాద్‌లో వందల ఏళ్ల క్రితం నిర్మించిన అద్భుత కట్టడాలున్నాయని రేవంత్ అన్నారు. వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం మరోవైపు ఉందని అన్నారు. కాళేశ్వరం కట్టినవారిని ఆదర్శంగా తీసుకుంటారో.. నాగార్జున సాగర్ కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటారో ఆలోచించుకోవాలని యువ ఇంజనీర్లకు పిలుపునిచ్చారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ఒకే విధంగా వ్యవహరించాలన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మీ అందరిపై ఉందని.. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచుకున్న కేసీఆర్.. 2015లో నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని నిలదీశారు. తెలంగాణ ఉద్యమం గొప్పతనాన్ని.. విద్యార్థి నిరుద్యోగుల త్యాగాలను కేసీఆర్ కవచంగా మార్చుకున్నారని మండిపడ్డారు. అక్టోబర్ 9న 11,063 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నామని.. ఇది తమ చిత్తశుద్ధి.. మా బాధ్యత అని రేవంత్ రెడ్డి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com