TG: విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోండి

TG: విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోండి
X
ఆహారంలో నిర్లక్ష్యాన్ని సహించేదే లేదు... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. విద్యార్థుల ఆహారం విషయంలో వరుసగా జరుగుతున్న ఘటనలపై ఇప్పటికే పలుమార్లు జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చోటుచేసుకోవడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనిఖీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు

జిల్లా కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్ని తనిఖీచేసి, ఆ నివేదికల్ని ప్రభుత్వానికి అందజేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు మంచి విద్య అందించాలన్న ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని రేవంత్ గుర్తు చేశారు. పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు డైట్‌ ఛార్జీలు పెంచామన్నారు. విద్యార్థుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నా... కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. వారైప కఠినంగా వ్యవహరించడంతో పాటు బాధ్యులను చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని... వసతిగృహాల్లో ఆహారం విషయంలో కొందరు వదంతులు సృష్టిస్తూ, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారన్నారు. తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఆహార భద్రత కమిటీలు..

విద్యాలయం, వసతిగృహం, అంగన్‌వాడీ స్థాయిలో కలుషిత ఆహార ఘటనలు నిరోధించేందుకు... ప్రభుత్వం తాజాగా ఆహార భద్రత కమిటీలను నియమించిందన్నారు. కలుషిత ఆహారం, నాణ్యతలోపం ఘటనలు నమోదైనప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదించేందుకు సంబంధిత విభాగాల పరిధిలో రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. రోజూ భోజనం వండేటప్పుడు అక్కడి స్టోర్‌రూమ్, కిచెన్‌ను పరిశీలించాలని... నాణ్యమైన ఆహార వస్తువులు, వంట గది పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఆహారం వండినతరువాత తొలుత ఆ భోజనం రుచి చూడాలని... భోజనం నాణ్యతతో ఉంటేనే.. పిల్లలకు వడ్డించేందుకు అనుమతించాలని ఆదేశించారు.

Tags

Next Story