TG: మహిళలకే పెద్ద పీట.. రేవంత్ కీలక నిర్ణయం

TG: మహిళలకే పెద్ద పీట..  రేవంత్ కీలక నిర్ణయం
X
కుటుంబ డిజిటల్‌ కార్డులో మహిళనే ఇంటి యజమానురాలిగా గుర్తించాలని రేవంత్ ఆదేశం.. లోపాలకు తావు లేకుండా ఇంటింటి పరిశీలన చేయాలని నిర్దేశం

తెలంగాణలో అమలు చేయాలని భావిస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సంబంధిత అధికారులతో సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళే ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒకే కార్డులోకి రేషన్, హెల్త్, ఇతర పథకాలు వర్తింపజేస్తామని అన్నారు. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అర్హుల నిర్ధారణ చేస్తామని వెల్లడించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు.అర్హులైనవారందరికీ ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాల ఫలాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ విధానాన్ని అవలంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్డు ద్వారానే లబ్ధిదారులు ఎక్కడినుంచైనా రేషను వస్తువులను తీసుకోవచ్చని, ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందవచ్చని, ఆ దిశగా ఉపయోగపడేలా ఈ కార్డులు ఉంటాయని స్పష్టం చేశారు. వైద్యారోగ్య అవసరాలకు చికిత్స పొందే సమయానికి సదరు వ్యక్తికి సంబంధించి హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఈ డిజిటల్ కార్డు ద్వారా డాక్టర్లు తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. ఈ డిజిటల్ కార్డులో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవచ్చని వెల్లడించారు.


యజమానిగా మహిళే

ప్రభుత్వం జారీ చేయనున్న కుటుంబ డిజిటల్‌ కార్డులో మహిళనే ఇంటి యజమానురాలిగా గుర్తించాలని రేవంత్ ఆదేశించారు. కుటుంబ సభ్యుల పేర్లు కార్డు వెనక వైపు ఉండాలన్నారు. ప్రయోగాత్మకంగా వచ్చే నెల 3 నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రెండేసి ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయిస్తామని, ప్రజల నుంచి బ్యాంకు ఖాతాలు, పాన్‌కార్డుల వంటి సమాచారం తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. ఎఫ్‌డీసీలపై ఈనెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రల్లో అధికారులు అధ్యయనం చేసి, ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కార్డుల జారీకి ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో ప్రయోజనాలు, లోపాలను వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.

సంక్షేమ పథకాల ఆధారంగా నిర్థారణ

ఇతర రాష్ట్రాల్లోని మేలైన అంశాలను స్వీకరించాలని.. ప్రస్తుతమున్న రేషన్, ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా కుటుంబాన్ని నిర్ధారించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. డిజిటల్‌ కార్డుల కోసం సేకరించాల్సిన, వాటిలో పొందుపర్చాల్సిన, అప్‌డేట్‌ చేయాల్సిన సమాచారాన్ని నివేదిక రూపంలో ఇవాళ సాయంత్రానికి మంత్రివర్గ ఉపసంఘానికి అందజేయాలని ఆదేశించారు. ఉపసంఘం సూచనల మేరకు జత చేయాల్సిన, తొలగించాల్సిన అంశాల సమగ్ర జాబితా రూపొందించాలన్నారు. అనంతరం 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేయాలన్నారు. ఒకవేళ పూర్తిగా గ్రామీణ నియోజకవర్గమైతే... రెండు గ్రామాలు, పట్టణ/నగర నియోజకవర్గమైతే రెండు వార్డులు, డివిజన్లను ఎంపిక చేయాలని వెల్లడించారు. అక్టోబరు 3వ తేదీ నుంచి ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇంటింటి పరిశీలన చేయించాలని.. గ్రామాల్లో ప్రతి నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి అధికారి, పట్టణ, నగర ప్రాంతాల్లో జోనల్‌ కమిషనర్‌ స్థాయి అధికారి పర్యవేక్షకులుగా ఉంటారన్నారు. ఈ పరిశీలన సమగ్రంగా, కచ్చితత్వంతో చేపట్టాలని... లోపాలకు తావివ్వకూడదని సీఎం స్పష్టమైన ఆదశాలు జారీ చేశారు.

Tags

Next Story