REVANTH: ప్రధాని ముందు కీలక ప్రతిపాదనలు

తెలంగాణ అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన ఆరు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌కు అనుమతి ఇవ్వాలని, రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా సీఎంతో ఉన్నారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన ఆరు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మెట్రో రైల్ ఫేజ్ 2, ట్రిపుల్ ఆర్ దక్షిణభాగం మంజూరు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు ఆర్థిక సహకారం, అదనపు ఐపీఎస్ ల కేటాయింపు, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టుకు అనుమతి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
రేవంత్‌కు ప్రధాని కీలక సూచనలు
సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేశారు. మార్చి 31 నాటికి పీఎం ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన అర్హుల లిస్టును సిద్దం చేసి ఇవ్వాలన్నారు. అలాగే, 2017 నుంచి 2022 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఈ క్రమంలో మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్లకు, రెండు రైల్వే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని ప్రధానిని సీఎం రేవంత్ కోరారు.
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీతో భేటీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. SLBC ప్రమాదం, రెస్క్యూ ఆపరేషన్ గురించి ప్రధానికి వివరించానని చెప్పారు. పదేళ్లుగా సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అలాగే, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఆయనతో చర్చించినట్లు తెలిపారు. ప్రాజెక్టుల సాధన బాధ్యత కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రతినెలా రూ.22,500 కోట్లు అవసరం: రేవంత్‌రెడ్డి
ప్రతినెలా ఒకటో తేదీకి రాష్ట్రానికి రూ.22,500 కోట్లు అవసరం అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం రూ.18,500 కోట్లు మాత్రమే ఉందని తెలిపారు. జీతాలకు రూ.6,500 కోట్లు, వడ్డీలకు రూ.6,800 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆదాయాన్ని రూ.22వేల కోట్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com