TG: ఆరాంఘర్ - జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం

TG: ఆరాంఘర్ - జూపార్క్ పైవంతెనను ప్రారంభించిన సీఎం
X
ఫ్లైఓవర్‌కు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు... కాంగ్రెస్-ఎంఐఎం కలిసి పనిచేస్తాయన్న రేవంత్ రెడ్డి

ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్‌కు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ దేశాన్ని నిలబెట్టారని తెలిపారు. అందుకే మన్మోహన్‌కు గుర్తుగా ఈ ఫ్లైఓవర్‌కు ఆయన పేరు పెడుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌, ఎంఐఎం కలిసి పని చేస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఆరాంఘర్‌-జూపార్కు ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నగరం నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు జూపార్కు నుంచి ఆరాంఘర్‌ వరకు 4.08 కిలోమీటర్ల పొడవున దాదాపు రూ.800 కోట్లతో ఈ పైవంతెనను జీహెచ్ఎంసీ నిర్మించింది. జూపార్క్- ఆరాంఘర్ ఫ్లైఓవర్.. పీవీ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైఓవర్‌ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ గా నిలిచింది.

రూ. 800 కోట్లతో నిర్మాణం

హైదరాబాద్ నుంచి బెంగుళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు జూపార్క్ నుంచి ఆరాంఘర్ వరకూ 4.08 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ.800 కోట్లతో ఈ పైవంతెనను బల్దియా నిర్మించింది. గతేడాది డిసెంబరులో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసినా కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. ఎస్ఆర్‌డీపీలో భాగంగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్ తర్వాత నగరంలో రెండో అతి పెద్ద వంతెన కావడం విశేషం. నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పైవంతెనలు, ఆర్వోబీలను నిర్మిస్తూ ట్రాఫిక్ ఇక్కట్లను దూరం చేస్తోంది.

42 ప్రాజెక్టులకు శ్రీకారం

హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్ (ఎస్ఆర్‌డీపీ)లో భాగంగా రూ.5,937 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ప్రయాణ వేగాన్ని పెంచడం, సమయాన్ని తగ్గించడం, వాయు కాలుష్యాన్ని తగ్గించడం, కనిష్ట భూ సేకరణ నిధుల ఆధారంగా ఎస్ఆర్‌డీపీకి ప్రాధాన్యత ఇచ్చారు. జూపార్క్ ఫ్లైఓవర్ 23వ ఫ్లైఓవర్ కాగా.. ఇప్పటికీ 14 చోట్ల ఆర్వోబీ, ఆర్‌యూబీలు అందుబాటులోకి వచ్చాయి ఆరాంఘర్, శాస్త్రిపురం, కలాపత్తర్, దారుల్ ఉల్ం, శివరాంపల్లి, హసన్ నగర్ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత ఉపశమనం లభించనుంది. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు రవాణా మెరుగుపరచడమే కాకుండా సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థకు దోహదపడనుంది.

Tags

Next Story