REVANTH: ప్రాణాలు పోతున్నా.. చూస్తూ ఊరుకోవాలా.. ?

REVANTH: ప్రాణాలు పోతున్నా.. చూస్తూ ఊరుకోవాలా.. ?
X
సినిమా వాళ్లు ఏమైనా ప్రత్యేకమా.. శాసనసభలో రేవంత్ రెడ్డి

సినీ ప్రముఖులు వ్యాపారం చేసుకుంటే తప్పులేదని, అదే సమయంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరముందని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించడం కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని.. అయితే, సామాన్యుల ప్రాణాలు పోతున్నా సరే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటే మాత్రం కుదరదని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ శాసనసభలో లేవనెత్తారు. ఓ మహిళ ప్రాణం పోయినా, ఆమె కొడుకు చావుబతుకుల్లో ఉన్నా ఫిల్మ్‌స్టార్‌ చేతులూపుకొంటూ రోడ్‌షో చేశారని... ఆ రోజు ఏం జరిగిందో ప్రకటన చేయాలని కోరారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ సభలో ప్రకటన చేశారు.

హీరోది బాధ్యతారాహిత్యం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం వల్లే తొక్కిసలాట జరిగిందని అసెంబ్లీలో ప్రకటించారు. రూ.12 వేలు పెట్టి మూడు టికెట్లు కొని ప్రాణాలు కోల్పోయినా.. బాధిత కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించలేదని రేవంత్ అన్నారు. ఇద్దరు చనిపోయారని పోలీసులు చెప్పినా.. సినిమా మొత్తం చూసిన తర్వాతే బయటకు వెళ్తానని అల్లు అర్జున్ చెప్పారన్నారు.

మానవత్వం లేదా..?

సినిమా వాళ్లకు మానవత్వం లేకపోవడాన్ని ఏమనాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సినీ పరిశ్రమ తీరు అమానవీయమని.. ఎవరి ప్రాణాలైనా పోయిన తర్వాత ప్రత్యేక హక్కు కావాలంటే దొరకదని పేర్కొన్నారు. కేవలం ఒక్కరోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన హీరోను పరామర్శించిన సినీ పరిశ్రమ పెద్దలు... బాధిత కుటుంబీకులను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. సాధారణ ప్రజల ప్రాణాలు కాపాడటం తమకు ప్రధానమని.. ప్రాణాలు పోయేందుకు ఎవరు కారణమైనా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారిని విచారించి శిక్షించే వరకు విడిచిపెట్టబోమని ప్రకటించారు. ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత సీఎంగా తనపైఉందని, వారినెవరు కష్టపెట్టినా కాంగ్రెస్‌ ప్రభుత్వం వదిలిపెట్టబోదన్నారు. అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి చేయి ఊపుకుంటూ రోడ్‌షోగా వెళ్లడంతో థియేటర్‌ చుట్టూ వేల మంది అభిమానులు జమయ్యారు. హీరో కారును లోపలికి పంపించేందుకు గేటు తెరవడంతో వారంతా ఉప్పెనలా తోసుకురావడంతో రేవతితోపాటు ఆమె కుమారుడు ఒకవైపు... ఆమె భర్త, కుమార్తె మరోవైపు వెళ్లాల్సివచ్చిందన్నారు. అప్పుడు తొక్కిసలాట జరిగి రేవతి మరణించగా.. శ్రీతేజ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు.



Tags

Next Story