REVANTH: కేసు నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీకి చక్కర్లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ-రేస్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ఢిల్లీకి వచ్చారని ఆరోపించారు. ఈ విషయంలో గవర్నర్ అనుమతి రాగానే ఆయనపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై విచారణకు అనుమతి కోరుతూ తెలంగాణ గవర్నర్‌కు ఏసీబీ లేఖ రాసి 15 రోజులైనా ఇప్పటివరకూ అనుమతి రాలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు. విచారణకు నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి కోరుతూ పంపిన దస్త్రం ఆయన వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు. విచారణకు అనుమతి నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ కేటీఆర్ చక్కర్లు కొడుతున్నారని రేవంత్ ఆరోపించారు. దీని ద్వారా బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి బంధం బయటపడుతోందని వెల్లడించారు. ఒకవైపు కేసీఆర్ అవినీతిపై తాము చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు బీజేపీ సాయపడుతోందని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. తెలంగాణలో ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని, కాంగ్రెస్‌కు ఓటేయొద్దని చెప్పడం ద్వారా మోదీ కూటమికి ఓటేయాలని బీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారని రేవంత్ విమర్శించారు.
కులగణన ఆరోపణలపై ఆగ్రహం
కులగణన సర్వేపై బీజేపీ, బీఆర్‌ఎస్ రాద్ధాంతం చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం సేకరించే సమాచారం బయటపెట్టబోమన్న రేవంత్... వ్యక్తిగత గోప్యతపై చట్టం ఉందన్నారు. దాని ప్రకారం డేటా ఎవరికీ ఇవ్వరని... మొబైల్ సిమ్ కావాలంటే ప్రైవేటు సంస్థలకు ప్రజలు తమ సమాచారం ఇస్తున్నారన్నారు. ప్రభుత్వంపై భరోసాతో సర్వేలో వివరాలు చెప్పాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల అమలు, సంక్షేమం కోసం కులగణన డేటా అవసరమని వెల్లడించారు. సరైన వివరాలిస్తే సంక్షేమ కార్యక్రమాల్ని ఇంకా బాగా అమలు చేస్తామని తెలిపారు. ఇతరుల మాదిరిగానే అదానీ, అంబానీలకు పెట్టుబడులకు అవకాశాలు ఇస్తామని... పీపీపీ పద్ధతిలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని రేవంత్ గుర్తు చేశారు. దానికి అదానీ రూ.100 కోట్లు ఇస్తే ఎలా తిరస్కరిస్తాని ప్రశ్నించారు. ప్రజలు ఏమైనా చెబితే అది నేరుగా సీఎంకు చేరేలా యాప్ ఉండాలని... సీఎస్ నుంచి పంచాయతీ కార్యదర్శి వరకూ ఫైళ్లు నిర్వహించడం పాత పద్ధతని... పదేళ్ల తర్వాతే తాను కేంద్రంలోకి వస్తానన్నారు. ఇప్పుడు ట్వంటీ20 రాజకీయాలు నడుస్తుండగా.. మా నేతలు కొందరు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారని... అలాంటివారు ఫార్మాట్ మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వారికి శిక్ష పడాల్సిందే
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇలాంటి దాడిని ప్రోత్సహించిన వారిని, దాడి చేయించిన వారిని ఊచలు లెక్క పెట్టేలా చేస్తామని చెప్పారు. అధికారులను చంపాలని చూస్తున్న వారిని BRS ఎలా సమర్థిస్తుందని మండిపడ్డారు. అటు అమృత్ టెండర్లపై BRS నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, అభ్యంతరాలు ఉంటే లీగల్‌గా ఫైట్ చేయాలని సీఎం సూచించారు. భూములు కోల్పోతున్నవారు నిరసన తెలపడంలో తప్పులేదు. కానీ, అధికారులపై పాశవికంగా దాడి చేయడాన్ని బీఆర్ఎస్ ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. దాడి చేసినవారు, ప్రోత్సహించినవారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఎంత పెద్దవాళ్లున్నా ఊచలు లెక్కపెట్టక తప్పదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com