REVANTH: రైతు ప్రయోజనాలకే ప్రభుత్వ ప్రాధాన్యం

REVANTH: రైతు ప్రయోజనాలకే ప్రభుత్వ ప్రాధాన్యం
లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీ.. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

తెలంగాణ ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యమని, అందుకనే రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కార్పొరేట్‌ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారన్న రేవంత్‌.. గత పదేళ్లలో కార్పొరేట్‌ కంపెనీలు రూ.14 లక్షల కోట్లు ఎగవేశాయని చెప్పారు. కానీ, సాగుకోసం బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం వాళ్ల రుణాలను మాఫీ చేస్తోందని చెప్పారు. రెండో విడత పంట రుణాల మాఫీ నిధుల విడుదల సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్‌ పాల్గొన్నారు.

గతంలో అనేక మంది రైతులు సొంత పొలంలోనే పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయారన్న రేవంత్‌... ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదనేదే తమ విధానమని స్పష్టం చేశారు. అందుకే రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలన్నీ మాఫీ చేశామని తెలిపారు. తెలంగాణలో రైతులందరి ఇళ్లల్లో ఇది పండుగ రోజని... సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రెండో విడతగా రూ.6,190 కోట్లు మాఫీ చేశామని ప్రకటించారు. రుణమాఫీ కింద సుమారు 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండో విడతగా రూ.6,190 కోట్లు జమ చేసింది. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు విడుదల చేశారు. ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ.12,225 కోట్లు జమ చేశారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పూర్తిగా మూలనపడ్డ పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామన్నారు. ఒకే పంటకాలంలో రూ.2 లక్షల మేర రుణమాఫీ చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అని కొనియాడారు. ఆయిల్‌పామ్‌ సరఫరాలో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ హామీలు ఇచ్చినప్పుడు అందరూ అనుమానాలు వ్యక్తం చేశారని, వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ రుణమాఫీ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతుల మేలుకోరే రుణమాఫీపై శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా రెండో విడతగా రుణమాఫీ పొందిన లబ్ధిదారులకు ఆయన అభినందనలు తెలిపారు.

Tags

Next Story