తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం!?

తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై పార్టీలు దృష్టిసారించాయి. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే ఛాన్స్‌ ఉండటంతో సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌ ఫైనల్‌ అయినట్లు తెలుస్తోంది. ఈసీ షెడ్యుల్ ప్రకటించడమే ఆలస్యం వెంటనే లిస్ట్‌ను రిలీజ్ చేసేందుకు హస్తం పార్టీ హైకమాండ్‌ రంగం సిద్ధం చేస్తోంది. సగానికి పైగా స్థానాల్లో స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థులను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. 50 మంది అభ్యర్థులతో ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేల పేర్లు తొలి జాబితాలోనే ఉంటాయని అంటున్నారు. 12 మంది మాజీ మంత్రులు మరోసారి అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న ముగ్గురు నేతలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కొడంగల్‌ నుంచి... కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ నుంచి... మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేయనున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, సీతక్క, పొడెం వీరయ్యతో పాటు... పలువురు కీలక నేతలు పోటీకి రెడీ అవుతున్నారు. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, కొండాసురేఖ, చిన్నారెడ్డి, గీతారెడ్డి, వినోద్, గడ్డం ప్రసాద్‌ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు సంపత్‌, వంశీకృష్ణ సైతం మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌.. ఈసారి పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. అందులో భాగంగానే అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవాలని భావిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ దఫా కచ్చితంగా గెలిచి తీరాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. 119 స్థానాలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 60 సీట్లు కాగా.. అంత కంటే ఎక్కువ స్థానాల్లో గెలించేందుకు పక్కా స్కెచ్ వేస్తోంది.

ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై హస్తం పార్టీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. తెలంగాణలో 19 ఎస్సీ ,12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.. వీటిలో మెజార్టీ సీట్లు గెలిస్తే .. అధికారం చేజిక్కిచుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయంలో ఉంది. గత ఎన్నికల్లో రిజర్వ్‌డ్‌ స్థానాల్లో బీఆర్ఎస్ 20, కాంగ్రెస్ 9, టీడీపీ రెండు స్థానాలు గెలుపొందింది. ఈ దఫా వీలైనన్ని రిజర్వ్‌డ్ సీట్లను గెలుచుకోవాలని చూస్తోంది. ఉమ్మడి పది జిల్లాల్లో దాదాపు 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా రెడీ అయింది. అఖరి నిమిషంలో ఒకట్రెండు నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. దాదాపు ఇప్పుడున్న లిస్టే ఫైనల్ అవుతుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story